తెలుగులో ‘మిడిల్ క్లాస్’ అనే పదం వినిపించగానే మనల్ని మనమే గుర్తు చేసుకున్నంత పని అవుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ జీవితం అనేది ప్రతి ఒక్కరికి రిలేటబుల్ గా ఉంటుంది. వారి కష్టాలు, కలలు, బాధలు, బాధ్యతలు, సంతోషాలు అన్నీ చిన్నా చితకా భావోద్వేగాలతో నిండిపోతాయి. అట్టడుగు నుంచి పైకి రావాలన్న తపన, కాస్త ఖర్చు పెరిగితే ఆందోళన, పిల్లల భవిష్యత్తుపై ఆశలు ఇవన్నీ ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబం (Middle class family) లో కనిపించే నిజాలు.ఈ తరహా జీవన తత్వాన్ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నమే ‘సోలో బాయ్’ సినిమా. యంగ్ హీరో గౌతమ్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, ఓ సాధారణ కుటుంబ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దారు. ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్, డ్రీమ్స్, బాధలు అన్నీ కలిపిన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కథలోకి వెళ్తే
ఓ ఇంజినీరింగ్ కాలేజ్ ఫ్రెషర్స్ డేతో సోలో బాయ్ కథ మొదలవుతుంది. బండి కొనిస్తే తప్ప ఇక నీతో మాట్లాడను అంటూ అమ్మని ఫోన్‌లో బెదిరిస్తున్న కాలేజ్ కుర్రాడికి (college boy) తన మిడిల్ క్లాస్ కథ చెప్పుకుంటాడు కృష్ణమూర్తి (గౌతమ్ కృష్ణ). కొడుకు అడక్కుండానే చిన్న చిన్న సరదాలు తీరుస్తూ సర్‌ప్రైజ్ చేసే తండ్రి (పోసాని కృష్ణ మురళి), లోకం మొత్తం నువ్వు ఒక ఫెయిల్యూర్ అని చెప్పినా నా కొడుకు అదే లోకాన్ని ఏలతాడు అని నమ్మే తల్లి (అనితా చౌదరి) తమ కొడుకుని ఎంతలా నమ్మారు ఎంత ప్రేమించారు అనే చిన్న చిన్న సీన్లతో సోలో బాయ్ సాగుతుంది.ఇక కాలేజ్ ఫస్ట్ డేనే ప్రియ (రమ్య పసులేటి)ని తొలిసారి చూసి ఇష్టపడతాడు కృష్ణమూర్తి. కట్ చేస్తే ఒక్క సాంగ్ పూర్తయ్యే లోపే ఇద్దరూ ప్రేమలో పడతారు.
అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు కృష్ణ
ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాలేజ్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం సాధించి పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశగా ప్రియని అడుగుతాడు కృష్ణమూర్తి. అయితే నా డ్రైవర్‌కి వచ్చే జీతమే నీకంటే ఎక్కువ అని అవమానించి, బ్రేకప్ చెప్పేస్తుంది ప్రియ. ఇక బ్రేకప్ బాధలో మందుకి బానిసైన కొడుకుకి తన తండ్రి కథ చెప్పి మళ్లీ దారిలోకి తెస్తాడు పోసాని.అయితే బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్న కృష్ణమూర్తి జీవితంలోకి శ్రుతి (శ్వేత అవస్తి) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు కృష్ణ. కానీ ఒక ఊహించని సంఘటన (తండ్రి మరణం)తో కృష్ణమూర్తి (Krishnamurti) జీవితం తలకిందులు అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి డైవర్స్ నోటీసులు పంపిస్తుంది. ఓవైపు తండ్రి మరణం, మరోవైపు భార్య విడాకులు నెత్తి మీద బారెడు అప్పు ఇలాంటి పరిస్థితి నుంచి ఒక మిలియనీర్‌గా, సక్సెస్ ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా కృష్ణమూర్తి ఎలా ఎదిగాడు అనేదే మిగిలిన కథ.
ఎందుకంటే ఇలాంటి స్టోరీలు చాలానే
ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి సక్సెస్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ కాలేజ్ కుర్రాడు మిలియనీర్‌గా ఎలా మారాడు, అందుకోసం ఎంత కష్టపడ్డాడు.రాత్రిపగలు ఎంత శ్రమించాడు.ఇలా ప్రతిదీ చూసేవాళ్లకి చాలా ఇంట్రెస్ట్ కలిగించే అంశం. అయితే దాన్ని ఎలా డీల్ చేశామనే దానిపైనే ఈ స్టోరీ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు చాలానే వచ్చాయి. కానీ సోలో బాయ్ (Solo Boy) లో అలాంటి ఛాయలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.దీనికి ప్రధాన కారణం స్క్రీన్ మీద కనిపించిన ఫేసులన్నీ చాలా ఫ్రెష్‌గా అనిపించాయి. కాలేజ్ స్టోరీలో ప్రియ పాత్రలో కనిపించిన రమ్య పసుపులేటి, గౌతమ్ భార్యగా చేసిన శ్వేత అవస్తి ఇలా మెయిన్ లీడ్స్ ముగ్గురిని స్క్రీన్‌పై చూసినప్పుడు ప్రేక్షకుడికి ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలిగేలా ఉంది.
పట్టువదలకుండా మిలియనీర్
ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండే బాధలు, అవమానాలు, అప్పులు, ఏదైనా సాధించాలనే కసి ఇలా ప్రతి సందర్భాన్ని స్క్రీన్‌పై నిజాయతీగా చూపించే ప్రయత్నం చేశారు.మొదట కాలేజ్ లైఫ్‌లో చిల్ అవుతూ కనిపించే కుర్రాడిగా, తర్వాత బ్రేకప్ బాధలు, మళ్లీ ప్రేమించి పెళ్లి, తండ్రి మరణం, అప్పులు, అక్కడి నుంచి పట్టువదలకుండా మిలియనీర్ అయ్యే కృష్ణమూర్తి పాత్రలో గౌతమ్ నటన ఆకట్టుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో గౌతమ్ (Gautham) ని ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడటానికి ప్రధాన కారణం నిజాయతీ, క్యారెక్టర్. ఇప్పుడు కృష్ణమూర్తి పాత్రలో కూడా అంతే నిజాయతీగా కనిపించాడు గౌతమ్. ఎక్కడా అక్కర్లేని ఎలివేషన్స్, హీరోయిజం జోలికి పోకుండా కృష్ణమూర్తి పాత్రలో ఒదిగిపోయాడు. హీరోగా తన రెండో సినిమా అయినప్పటికీ గౌతమ్ నటనలో చాలా మెరుగుపడ్డాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Ghati Movie: మళ్ళీ వాయిదా పడ్డ అనుష్క ‘ఘాటీ’ సినిమా