భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వెబ్ సిరీస్‌లో నటించాడా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా విడుదలకు సిద్ధమైన ‘ఖాకీ ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2) వెబ్ సిరీస్‌లో గంగూలీ అతిథి పాత్ర పోషించాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీస్ యూనిఫాంలో ఉన్న గంగూలీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, వెబ్ సిరీస్ నిర్మాత నీరజ్ పాండే మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వకుండా మిస్టరీని కొనసాగిస్తున్నారు. గంగూలీ వేషధారణను చూసి కొంతమంది నెటిజన్లు ఇది సిరీస్‌లో నటించిన పాత్ర అయితే కావచ్చు అంటుండగా, మరికొందరు ఇది కేవలం ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో భాగమేనని అంటున్నారు. అయితే, అసలు గంగూలీ ఇందులో నటించాడా? లేదా? అనేది ఈ నెల 20న సిరీస్ స్ట్రీమింగ్ అయిన తర్వాతే ఖచ్చితంగా తెలుస్తుంది
‘ఖాకీ 2’ – కథ, తారాగణం
ఈ వెబ్ సిరీస్ 2022లో వచ్చిన ‘ఖాకీ ది బిహార్ చాప్టర్’ కు కొనసాగింపుగా రూపొందించబడింది. ఖాకీ 2 లో జీత్, ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు నీరజ్ పాండే మాట్లాడుతూ, ఈ కథలోని ప్రధానాంశాలు బిహార్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి అమిత్ లోథా వృత్తి జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా రూపొందించబడినట్లు చెప్పారు. 2022లో వచ్చిన మొదటి సీజన్ ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో ఇప్పుడు ఖాకీ 2 ను మరింత ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఇదే సమయంలో సౌరభ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై చర్చ జరుగుతుండగా, ఇటీవలి కాలంలో రాజ్‌కుమార్‌రావు ఈ బయోపిక్‌కి హీరోగా ఖరారు అయినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారత క్రికెట్‌ను కొత్త దిశగా తీసుకెళ్లిన గంగూలీ కెప్టెన్‌గా, బీసీసీఐ అధ్యక్షుడిగా క్రికెట్‌కు చేసిన సేవలు తెలిసిందే. ఇప్పుడు వెబ్ సిరీస్ లాంటి విభిన్న రంగాల్లో కూడా అడుగుపెడుతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గంగూలీ ఖాకీ 2 వెబ్ సిరీస్‌లో అతిథి పాత్రలో కనిపించనున్నారా? అనే అంశంపై స్పష్టత లేదు. పోలీస్ యూనిఫాంలో ఉన్న గంగూలీ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఈ విషయంపై వెబ్ సిరీస్ నిర్మాత నీరజ్ పాండే సూటిగా జవాబివ్వలేదు. గంగూలీ బయోపిక్ కోసం రాజ్‌కుమార్‌రావును హీరోగా ఖరారు చేసినట్లు సమాచారం. గంగూలీ నిజంగా వెబ్ సిరీస్‌లో కనిపించారా? అనేది తెలుసుకోవాలంటే మార్చి 20 వరకు వేచి చూడాల్సిందే!