బర్డ్ ఫ్లూ భయాన్ని తరిమికొట్టేందుకు ఫౌల్ట్రీ ఫెడరేషన్ శ్రీకారం చుట్టింది. ప్రజల్లో బర్డ్ ఫ్లూ ఫియర్‌ను తొలగించడమే లక్ష్యంగా చికెన్ మేళాలు ఏర్పాటు చేసింది. ఈ మేళాల్లో చికెన్ ఫ్రై ఐటెమ్స్‌తోపాటు.. బాయిల్డ్ ఎగ్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. హైదరాబాద్ ఉప్పల్‌లో చికెన్ వంటకాల కోసం జనం భారీగా తరలివచ్చారు. చికెన్ తిందామంటే వామ్మో బర్డ్ ప్లూ వస్తుందేమో అన్న భయం.. అలాంటిది ఏం ఉండదు అని నిపుణులు చెబుతున్నా.. ఎందుకు లే బాబు రిస్క్ అనుకుంటున్నారు జనాలు. దీంతో చికెన్ సేల్స్ విపరీతంగా తగ్గాయి.

ప్రత్యేక చికెన్ మేళాలు
చికెన్ వ్యాపారులు, పౌల్ట్రీ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలోనే.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పౌల్ట్రీ బ్రీడర్స్ కో-ఆర్డినేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చికెన్ మేళాలు ప్రారంభించారు నిర్వాహకులు. చికెన్‌తో రకరకాల డిష్‌లు తయారు చేసి ఫ్రీగా పంపిణీ చేశారు. ఉడకబెట్టిన చికెన్, గుడ్లు తింటే ఏమీ అవ్వదు అని చాటి చెప్పేందుకు ఫ్రీ చికెన్, ఎగ్ మేళాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్‌లో నిర్వహించిన మేళాలో ఉచిత చికెన్ ఫ్రై ఐటెమ్స్, ఎగ్ తినేందుకు నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. ఇలా జంట నగరాల్లో 6 చోట్ల మేళాలను నిర్వహించారు. ప్రతి చోటా 200 కిలోల చికెన్ స్నాక్స్, 2,000 ఎగ్స్‌తో సంబంధిత స్నాక్స్ ప్రజలకు పంపిణీ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరో 250 ప్రదేశాలలో ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని నిర్వాహకులు యోచిస్తున్నారు.
అపోహలు వద్దు
చికెన్, గుడ్లు తినే విషయంలో ఎలాంటి అపోహలు వద్దని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారం ఉడికించిన, వేయించిన చికెన్, ఎగ్స్ తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు. తక్కువ కాస్ట్‌లో… ఎక్కువ పోషకాలు లభించే చికెన్, గుడ్డును పక్కన పెట్టొద్దంటున్నారు.