పచ్చి మామిడి అనగానే మనకు గుర్తొచ్చేది ఉప్పు-కారం కలిపి తినే పద్ధతే. పిల్లల నుంచి పెద్దలవరకూ అందరికీ ఇష్టమైన ఈ కాయ రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వేసవి తాపాన్ని తట్టుకునే శక్తినిస్తుందన్న విషయాన్ని ప్రాచీన ఆయుర్వేదం నుంచీ ఆధునిక పోషక శాస్త్రం వరకూ అనేక అధ్యయనాలు నిర్ధారించాయి.
ముఖ్య పోషక విలువలు
పచ్చి మామిడిలోని ముఖ్య పోషకాలలో విటమిన్ C, విటమిన్ A, B-కాంప్లెక్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు ప్రాధాన్యం కలిగి ఉంటాయి. మామిడిపండ్లు పండేలోపు ఉండే నాచురల్ యాసిడ్‌ల వల్ల దీనికి ప్రత్యేకమైన రుచి వస్తుంది, కానీ అదే యాసిడ్‌లు శరీరాన్ని పలు విధాలుగా శక్తివంతం చేస్తాయి.
పచ్చి మామిడి ప్రయోజనాలు
రోగ నిరోధక శక్తికి బలాన్నిచ్చే విటమిన్ C
పచ్చి మామిడిలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని తెల్ల రక్తకణాల ఉత్పత్తిని మెరుగుపరచి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది గాయాల నయం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయకరంగా ఉంటుంది. వేసవిలో వైరల్ ఫీవర్లు, జలుబు, దగ్గుల వంటివి సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి వ్యతిరేకంగా ఈ పచ్చి మామిడి సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థకు మేలు
పచ్చి మామిడిలో ఫైబర్, పెక్టిన్ అనే సహజ పదార్థాలు అధికంగా ఉండటం వల్ల పేగుల పనితీరును మెరుగుపరుస్తాయి. మలబద్దకం, అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యలకు ఇది స్వభావసిద్ధమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ కొద్ది మోతాదులో పచ్చి మామిడిని తీసుకుంటే జీర్ణక్రియ చక్కబడి, ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. వేసవి తీవ్రత పెరిగే సమయంలో శరీరం లోపల వేడి పెరగడం, డీహైడ్రేషన్ కావడం సహజం. పచ్చి మామిడిలో ఉండే సహజ ఎలక్ట్రోలైట్లు ముఖ్యంగా సోడియం, పొటాషియం శరీరంలోని నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వేసవి మంట కారణంగా వచ్చే తలనొప్పులు, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి.
గుండె ఆరోగ్యానికి మేలు
పొటాషియం శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడుతుంది. ఇది రక్తపోటు నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. పచ్చి మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను రక్షించడంలో సహాయపడతాయి. అలాగే కాల్షియం కూడా గుండె మాంసపేశులకు అవసరమైన మూలకం.
బరువు తగ్గించడంలో సహాయం
పచ్చి మామిడిలో కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది డైట్‌లో భాగంగా తీసుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగవ్వడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతమవుతుంది. అంతేకాదు, దీనిలోని పీచు ఆకలిని తగ్గించి ఎక్కువగా తినకుండా నిరోధిస్తుంది. విటమిన్ C తో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పచ్చి మామిడిలో ఉండటం వల్ల ఇది చర్మకోశాలను నయం చేస్తుంది. కాంతి కోల్పోయిన చర్మానికి చలాకీతనం ఇస్తుంది. ఎండలో చర్మం నలుపు పడకుండా రక్షణ కూడా కలిగిస్తుంది. పచ్చి మామిడిలో నాచురల్ యాసిడ్లు అధికంగా ఉండడం వల్ల కొందరికి ఇది ఆమ్లత్వాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారు అధికంగా తీసుకోవద్దు.
Read also: Peanuts: పల్లీలు, నువ్వులు కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు