రేపు అక్టోబరు 12న దసరా పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విజయదశమి పర్వదినం ఆహ్వానిస్తూ దేశ, విదేశాల్లో నివసించే తెలుగు ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. దసరా పండుగ గొప్పతనాన్ని ఉటంకిస్తూ, మానవుల జీవితాల్లో ఈ పండుగ కొత్త వెలుగులు నింపాలని చెప్పారు.
“దసరా అనేది చెడుపై మంచిది సాధించిన విజయానికి ప్రతీక. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సానుకూలత తీసుకురావాలని, శాంతి, సమృద్ధి, సౌభ్రాతృత్వం పెంపొందించాలన్నదే దసరా సందేశం” అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన పిలుపునిస్తూ, “దుష్ట సంహారం తరువాత శాంతియుత, అభివృద్ధి చెందిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని అన్నారు.
దసరా పండుగలో శక్తి ఆరాధనకు ఉన్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది అవతారాలను భక్తులు దర్శించుకుంటారని, ఇది భారతీయ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన అంశమని పేర్కొన్నారు. దేవతా శక్తులను ఆరాధించే ఈ దసరా పర్వదినం, మనల్ని సానుకూల దిశలో నడిపించాలని కోరారు.
ఇక తిరుమలలో ఇటీవల నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయని చంద్రబాబు వివరించారు. ఈ పవిత్ర ఉత్సవాలు భక్తి భావాన్ని పెంపొందించడంతోపాటు, సామాజిక సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.
తన సందేశం చివర్లో, చంద్రబాబు మరోసారి దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, “సర్వజన హితంతో, సర్వజన సుఖంతో అభివృద్ధి దిశగా కృషి కొనసాగిద్దాం” అని పిలుపునిచ్చారు.