సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు విన్నవించారు. జత్వానీపై తప్పుడు కేసు నమోదు చేసి, అక్రమ అరెస్టు చేయడం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీయాలంటే నిందితులను అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇబ్రహీంపట్నం పోలీసులు జత్వానీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులైన కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, హనుమంతరావు, సత్యనారాయణలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ విఆర్‌కే కృపాసాగర్ విచారణ చేపట్టారు.
జత్వానీ తరపున న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభుదాస్, నర్రా శ్రీనివాసరావులు వాదనలు వినిపిస్తూ, ఆమె అరెస్టు వెనుక నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. ఆయన ఆదేశాల ప్రకారమే జత్వానీని ముంబయి నుంచి విజయవాడకు తీసుకువచ్చి, తప్పుడు కేసు నమోదు చేశారని వివరించారు.
పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదిస్తూ ఫిబ్రవరిలో కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా జత్వానీపై కేసు నమోదైందని చెప్పారు. ఈ కేసు విచారణ పూర్తికాకుండానే జత్వానీ ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదు చేయడం చెల్లదని చెప్పారు. నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు కోరారు. తదుపరి వాదనల కోసం కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ సమయంలో నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. ఈ కేసులో న్యాయపరమైన వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి.