న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను చదవి వినిపిస్తున్నారు. కేంద్రం గిగ్ వర్కర్లకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న (స్విగ్వీ, జొమాటో) వలే డెలివరీ సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు కోటి మంది వరకు బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటన చేసింది. అందుకోసం గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరేలా గుర్తింపు కార్డులను సైతం కేంద్రం ప్రకటించింది. కోటి మంది గిగ్ వర్కర్లకు పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమాను అమలు చేయనున్నారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా గిగ్ వర్కర్ల పేర్లను నమోదు చేసుకోవచ్చని కేంద్రం సూచించింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా రహదారులపై సంచరించే వారికి బీమా సౌకర్యం ఎంతగానో ఉపయోగపడనుందని నిపుణులు చెబుతున్నారు.

పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల పాటు ప్రణాళిక రూపొందించామని.. ప్రయోగాత్మకంగా పీఎం ధన్‌ధాన్య కృషి యోజన తీసుకొచ్చామన్నారు. 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. వలసలు అరికట్టడంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. మూడు రకాల పప్పు ధాన్యాల్లో స్వయం సంవృద్ధి సాధించామన్నారు. బిహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అధిక దిగుబడి విత్తనాల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపుతో 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం తీసుకువచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు.