ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల యూజర్లకు సేవలు అందిస్తోంది. మెటా గ్రూప్ ఆధీనంలో నడుస్తున్న ఈ యాప్ నిత్యం వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేలా అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఉంటుంది. తాజాగా, మీడియా డౌన్‌లోడ్ క్వాలిటీపై నియంత్రణ యూజర్లకు ఇచ్చే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
స్టోరేజ్ & డేటా సెట్టింగ్స్ లోకి కొత్త ఆప్షన్
వాట్సాప్ ట్రాకర్ WABetainfo నివేదిక ప్రకారం ఈ కొత్త ఫీచర్ Android 2.25.18.11 బీటా వెర్షన్‌లో పరీక్షల దశలో ఉంది. వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోల ఆటో డౌన్‌లోడ్ క్వాలిటీ విషయంలో నియంత్రణను యూజర్లకే ఇవ్వనుంది.
ఆటో డౌన్‌లోడ్ క్వాలిటీపై పూర్తి నియంత్రణ
ఇప్పటి వరకు, వాట్సాప్‌లో మీకు వచ్చిన ఫోటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుండేది. ఈ కొత్త ఫీచర్‌తో తమ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయ్యే మీడియా ఫైల్స్ (ఫోటోలు, వీడియోలు) క్వాలిటీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అవసరం లేకపోతే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆఫ్ చేసుకునే సౌలభ్యం కూడా యూజర్లకు ఉంటుంది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఇలాంటి సదుపాయం లేదు.
డిఫాల్ట్‌గా స్టాండర్డ్, మాన్యువల్‌గా హెచ్‌డీకి మారే వీలుంది
ఈ సెట్టింగ్స్‌ను స్టాండర్డ్‌గా సెట్ చేసిన సమయంలో వాట్సాప్ మీడియా ఫైల్స్‌ను డిఫాల్ట్‌గా డౌన్‌లోడ్ చేస్తుంది. అయితే యూజర్లు అదే ఫైల్ హెచ్‌డీ వెర్షన్‌ను యాప్‌లో చూసి మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం బీటా యూజర్లకే అందుబాటులో
ఈ ఆప్షన్ కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్ అండ్ డేటాలో డౌన్‌లోడ్ క్వాలిటీని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాండర్డ్, హెచ్‌డీ ఆప్షన్‌లలో మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి. స్టాండర్డ్ క్వాలిటీని ఎంపిక చేసుకుంటే యూజర్లు ఎవరికైనా పంపే ఫోటోలు, వీడియోల క్వాలిటీ తగ్గుతుంది. తద్వారా డేటాతో పాటు మొబైల్ స్టోరేజ్ తక్కువగా ఉన్నా సరిపోతుంది. హెచ్‌డీ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే డేటా వినియోగం పెరుగుతుంది. అదే సమయంలో మొబైల్‌లో ఎక్కువ స్టోరేజ్ ఆక్రమిస్తుంది.
భవిష్యత్తులో మరిన్ని ఆధునిక ఫీచర్లకు దారి
వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన డ్యూయల్ అప్‌లోడ్ ఫీచర్ ఆధారంగా తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్లే బీటా ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకున్న కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. మెటా ఏప్రిల్‌లో ఐఓఎస్ వెర్షన్ కోసం ఇలాంటి ఫీచర్‌నే ప్రారంభించింది, కానీ ఇప్పటి వరకు యూజర్లందరికీ అందుబాటులోకి రాలేదు.