జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ బైసరీన్ వ్యాలీలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. విశాఖపట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ఇటీవల కశ్మీర్‌కు టూర్కు వెళ్లారు. దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యుల్లో ఆందోళన
దాడి జరిగిన అనంతరం చంద్రమౌళితో బంధువులు ఫోన్‌లో ట్రై చేసినా, ఆయనుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీనితో, ఆయన భార్య పోలీసులను ఆశ్రయించి, తన భర్త ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రమౌళి ఆచూకీ కోసం గాలింపు
ప్రస్తుతం పోలీసులు చంద్రమౌళి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం. కశ్మీర్‌లో భద్రతా పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి క్లిష్టంగా మారడంతో, అక్కడికి వెళ్లిన పర్యాటకుల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు ఆయన సురక్షితంగా తిరిగి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు.