ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (Q3) సంబంధించి సీనియర్ ఉద్యోగుల వేరియబుల్ పేను మరింత తగ్గించినట్లు సమాచారం. ఇది వరుసగా రెండోసారి తగ్గింపుగా ఉండడం గమనార్హం.
టీసీఎస్ మొదటి త్రైమాసికంలో ఉద్యోగులకు 70% వేరియబుల్ పే అందించగా, రెండో త్రైమాసికంలో 20-40% మాత్రమే ఇచ్చింది. తాజాగా మూడో త్రైమాసికంలో ఈ మొత్తాన్ని మరింత తగ్గించినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. కంపెనీ ఆర్థిక పరిస్థితులు, వ్యయ నియంత్రణ చర్యలు ఈ నిర్ణయానికి కారణంగా చెప్పబడుతున్నాయి.
కంపెనీ నిర్ణయంతో ఉద్యోగులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆఫీసుకు వచ్చి పూర్తిగా పని చేస్తున్నప్పటికీ వేతనంలో కోతలు పెడతారా? అనే ప్రశ్న ఉద్యోగులను వేధిస్తోంది. తాము అంచనా వేసుకున్న మొత్తానికి తక్కువగా వేరియబుల్ పే రావడంతో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
ఒక ఉద్యోగి తన అనుభవాన్ని షేర్ చేస్తూ, తనకు సాధారణంగా ₹50,000-₹55,000 వేరియబుల్ పే రావాల్సి ఉండగా, రెండో త్రైమాసికంలో సగమే అందిందని, ఇప్పుడు మూడో త్రైమాసికంలో మరింత తగ్గించారని పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఉద్యోగుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టీసీఎస్ ఉద్యోగులకు వేరియబుల్ పేలో కోత విధించడం కొత్త విషయం కాదు. అయినప్పటికీ, వరుసగా రెండుసార్లు వేతనంలో కోత విధించడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సంస్థ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అన్న ప్రశ్న ఉద్యోగులను కంగారు పెడుతుంది.