వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలోనూ మన దేశంలో కుటుంబాల పొదుపు తగ్గింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు జీడీపీ(GDP)లో 18.1 శాతానికి పరిమితమైందని నివేదిక వెల్లడించింది. స్థూల దేశీయ పొదుపు 2014-15లో జీడీపీ(GDP) లో 32.2 శాతంగా ఉండగా, 2023-24 నాటికి జీడీపీలో 30.7 శాతానికి పరిమితమైంది. మరోవైపు కుటుంబాల రుణాలు జీడీపీ(GDP)లో 6.2 శాతానికి పెరిగాయి. గత దశాబ్ద కాలంలో చూస్తే ఇవి దాదాపు రెట్టింపయ్యాయి. వినియోగ అవసరాల కోసం ప్రజలు రుణాలపై ఆధారపడటాన్ని ఇది సూచిస్తోందని నివేదిక వెల్లడించింది.
గ్రామీణ వేతనాల్లో వృద్ధి
పొదుపు ధోరణులను గమనిస్తే.. గ్రామీణ ప్రాంతాలు కొంచెం మెరుగ్గా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామీణ పురుష కార్మికుల వేతనాలు 6.1% వృద్ధి చెందాయి. వరుసగా నాలుగో నెలా గ్రామీణ ద్రవ్యోల్బణం కంటే ఇది అధికం. ఆహార ద్రవ్యోల్బణం తగ్గడం, సానుకూల వ్యవసాయ పరిస్థితుల నేపథ్యంలో, గ్రామీణ గిరాకీ పుంజుకోవడం కొనసాగొచ్చని నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగదారు విశ్వాసం ఆశావహంగా ఉండగా, పట్టణ వినియోగదారు విశ్వాసం ప్రతికూలంగా ఉంది.
కార్పొరేట్ వ్యయాల్లో తగ్గుదల
ప్రధాన ఐటీ సంస్థల్లో ఉద్యోగ ఖర్చుల వృద్ధి 2022-23 మూడో త్రైమాసికంలో 26% కాగా, 2024-25 మూడో త్రైమాసికంలో ఇది 4 శాతానికి పరిమితం అయ్యింది. కార్పొరేట్ రంగంలో వ్యయాల హేతుబద్ధీకరణ ధోరణిని ఇది సూచిస్తోంది. 2025 ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.2 శాతానికి తగ్గింది. 2019 ఆగస్టు తర్వాత ఇదే అత్యల్పం. వంట నూనెలు (17.4%), పండ్లు (13.8%) ధరలు మాత్రమే అధికంగా కొనసాగాయి. రిజర్వాయర్‌ల్లో మంచి నీటి నిల్వలు, ఈ ఏడాది సగటు కంటే అధిక వర్షపాతం ఉండొచ్చన్న అంచనాలతో ఆహార ధరల స్థిరత్వం కొనసాగొచ్చని నివేదిక అంచనా వేసింది.
ద్రవ్యోల్బణంలో భారీ తగ్గుదల
ఆర్‌బీఐ కీలక రేట్ల కోతలు, ఆదాయపు పన్ను ఉపశమనం, ధరల తగ్గుదల వంటివి గిరాకీ పెరగడానికి దోహదం చేయొచ్చు. ఇండియా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, కుటుంబాల పొదుపు తగ్గుతుండడం ఆందోళనకర విషయం. రుణాలపై ఆధారపడటమూ భవిష్యత్ ఆర్థిక భద్రతపై ప్రభావం చూపించవచ్చు.
సమగ్ర విధానాలతో వినియోగదారుల విశ్వాసాన్ని మెరుగుపరచడం అవసరం.
Read Also: Bloomberg: ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసిన బ్లూమ్‌బర్గ్