అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన టారిఫ్‌లు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా అమెరికాకు వెళ్తున్న భారత ఉత్పత్తుల ధరలు అక్కడ భారీగా పెరిగాయి. పెరిగిన ధరలతో మార్కెట్‌లో పోటీ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది.‘గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్’ నివేదిక ప్రకారం ఆగస్టులో భారత ఎగుమతులు (Indian exports) 16.3 శాతం పడిపోయాయి. ఆ విలువ కేవలం 6.7 బిలియన్ డాలర్లకే చేరింది. టారిఫ్‌లు ఒక్కసారిగా 50 శాతం పెరగడంతో ఈ తరుగుదల కనిపించింది. వరుసగా మూడు నెలలుగా ఇలాగే తగ్గుదల కొనసాగుతోంది. జూలైలో ఇది 3.6 శాతం కాగా, జూన్‌లో 5.7 శాతం తగ్గింది.మేలో మాత్రం ఎగుమతులు 4.8 శాతం పెరిగి 8.8 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏప్రిల్‌లో 8.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. టారిఫ్‌ల పెరుగుదల వలన ఎగుమతులు ఒక్కసారిగా పతనమయ్యాయి.
జీటీఆర్‌ఐ హెచ్చరిక
జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ ప్రకారం, ఈ ట్రెండ్ కొనసాగితే సెప్టెంబర్‌లో మరింత తీవ్రమైన పతనం వస్తుందని అంచనా. టారిఫ్‌ల దెబ్బ పూర్తిస్థాయిలో ఈ నెలలోనే కనిపిస్తుందని ఆయన తెలిపారు.ఏప్రిల్ 4 వరకు భారత్‌కు అమెరికా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా కలిగింది. అప్పటివరకు భారత సరుకులు ఎలాంటి సమస్యలు లేకుండా ఎగుమతి అయ్యాయి. కానీ ఆ తర్వాత ట్రంప్ అన్ని దేశాలపై 10 శాతం పన్ను విధించారు. ఇది పెద్దగా ప్రభావం చూపకపోవడంతో మేలో ఎగుమతులు పెరిగాయి.ఆ తర్వాత పరిస్థితి మారింది. ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త సుంకాలు భారంగా మారాయి. తొలుత 25 శాతం, తరువాత మరో 25 శాతం పన్నులు భారత్‌పై విధించారు. ఫలితంగా ఎగుమతులు తీవ్రమైన దెబ్బతిన్నాయి.
మినహాయింపు పొందిన రంగాలు
భారతదేశం నుంచి అమెరికాకు వెళ్తున్న ఫోన్‌లు, ఔషధాలకు మాత్రం మినహాయింపు లభించింది. అయినప్పటికీ మిగిలిన ఉత్పత్తులు బాగా ప్రభావితం అయ్యాయి.దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, లెదర్, రొయ్యలు, కార్పెట్‌లు వంటి పరిశ్రమలు ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నాయి. వీటిలో 30 నుంచి 60 శాతం వరకు ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతి అవుతాయి. టారిఫ్‌ల ప్రభావం కొనసాగితే ఈ రంగాలపై మరింత ఒత్తిడి పెరగనుంది.
భారీ నష్టం అంచనా
ఆర్థిక నిపుణుల లెక్కల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం వరకు ఈ టారిఫ్‌లు కొనసాగితే భారత్ 30-35 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని చవిచూడవచ్చు. ఇది భారత్-అమెరికా వ్యాపార సంబంధాలకు పెద్ద దెబ్బ అవుతుంది. మొత్తంగా, ట్రంప్ టారిఫ్‌లు భారత ఎగుమతులకు పెద్ద సవాలుగా మారాయి. కొన్ని రంగాలు మినహాయింపులు పొందినా, మిగిలిన ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లో నిలబడటం కష్టమవుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే వచ్చే సంవత్సరాల్లో వ్యాపార నష్టాలు మరింత పెరగడం ఖాయం.
Read Also :