హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో(Government schools) చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి ఉదయంపూట అల్పాహారం అందించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును పాఠశాల విద్యశాఖ ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని విద్యార్థులకు ఉదయం టిఫిన్ పెడితే ఎంత ఖర్చు అవుతుందనే అంచనా వేస్తున్నారు. అల్పాహారంలో భాగంగా మూడు రోజులు రైస్ ఐటమ్స్ ను అందించాలని ఒకరోజు ఇడ్లీ, మరో రోజు బొండాను అందించాలనే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: Electricity: తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ పాఠశాలలు(Government schools) ఎన్ని ఉన్నాయి.. వాటిలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను తీసుకుంటున్నారు. స్కూల్స్ నమోదైన విద్యార్థుల్లో ప్రతిరోజూ పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల శాతం ఎంత మేరకు ఉంటుందనే లెక్కలను సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా ప్రతిరోజూ ఎంత మందికి ఉదయం టిఫిన్ ను అందించాల్సి వస్తుందని.. అందుకు ఎంత మేరకు ఖర్చు అవుతుందనే ప్రణాళికలను పాఠశాల విద్య శాఖ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో 18, 250 ప్రైమరీ స్కూల్స్, 3143 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 4704 ఉన్నత పాఠశాలలు (హైస్కూల్స్) కొనసాగుతున్నాయి.
మొత్తం 26,097 స్కూల్స్ కొనసాగుతుండగా వాటిల్లో 16.70 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం అందిస్తోంది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కేంద్రం తమ వాటా నిధులను ఇస్తున్నప్పటికీ మిగిలిన వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అలాగే 9, 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి గవర్నమెంట్ స్కూల్కి వచ్చే విద్యార్థులకు ఇప్పటికే మధ్యాహ్న భోజనం అందిస్తున్న నేపథ్యంలో ఉదయం టిఫిన్ను కూడా అందించాలనే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉంది.
ఇప్పటికే ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొద్ది రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం టిఫిన్ న్ను అందించడానికి పాఠశాల విద్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అయ్యే ఖర్చులో కేంద్రం నుంచి వాటాను పిఎంశ్రీ పథకం ద్వారా అందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. రాకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2023లో జరిగిన ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సిఎం అల్పాహారం పేరుతో పథకాన్ని ప్రారంభించాలని భావించింది. అక్టోబర్ 2023లో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి కొన్ని స్కూల్స్ ప్రారంభించింది. అప్పటి ముఖ్యమంత్రి, విద్యశాఖ మంత్రి, ఐటి శాఖ మంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులు కొన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించారు కూడా. ఆ తరువాత ఎన్నికల కోడ్ రావడంతో ఈ పథకం పూర్తిగా అమలుకు నోచుకోకుండా ఆగిపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: