హిందువులు, జైనులు అత్యంత పవిత్రంగా భావించే పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి.ఈ దినాన్ని అక్తి లేదా అఖా తీజ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 30న, బుధవారం రోజున వస్తోంది.హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ తిథికి ఈ ప్రత్యేకత ఉంది.ఈ రోజు చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది.అందుకే జ్యువెల్లరీ షాపులు సువర్ణ అవకాశాలను అందిస్తున్నాయి.డిస్కౌంట్లు, మేకింగ్ ఛార్జీల తగ్గింపులు వంటి లాభాలను వారు ప్రకటిస్తున్నారు. అక్షయ తృతీయ దిన విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం.సంస్కృతంలో ‘అక్షయ’ అంటే శాశ్వతమైనది.’తృతీయ’ అంటే మూడవ తిథి. ఈ రోజున చేసిన పనులు నిలకడగా విజయవంతం అవుతాయని నమ్మకం ఉంది.పెట్టుబడులు, ప్రారంభించిన కార్యక్రమాలు శాశ్వతంగా శ్రేయస్సు తెచ్చిపెడతాయని భక్తులు విశ్వసిస్తారు.
బంగారం కొనడం ఒక ప్రత్యేక సంప్రదాయం
ఈ రోజున బంగారం కొనడం చాలా ముఖ్యమైన ఆచారం.బంగారం సంపదను, భద్రతను సూచించేదిగా భావిస్తారు. ఈ రోజున కొనుగోలు చేసిన బంగారం కుటుంబానికి సంపద, సిరి సంపదలను తీసుకువస్తుందని నమ్ముతారు.అక్షయ తృతీయ అనేక పవిత్ర సంఘటనలకు సాక్షిగా నిలిచింది. త్రేతాయుగం ఈ రోజున ప్రారంభమైందని పురాణ గాధలు చెబుతున్నాయి. శ్రీ పరశురాముడు జన్మించింది కూడా ఇదే రోజు.ఇంకా, వేదవ్యాస మహర్షి మహాభారత రచన ప్రారంభించాడని కూడా చెబుతారు. శ్రీకృష్ణుడు తన మిత్రుడు కుచేలుడిని కలిసిన రోజు కూడా ఇదే అని నమ్మకం. పవిత్ర గంగా భూమిపైకి దిగివచ్చిన పవిత్ర సందర్భం కూడా ఇదే రోజు సంభవించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
పూజలు, ఉపవాసాలు, దానాలు
ఈ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు. శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పసుపు, కుంకుమలతో అక్షతలను స్వామివారికి సమర్పిస్తారు. గణపతి, కుబేరుడు వంటి దేవతలకు కూడా నైవేద్యాలు సమర్పిస్తారు.కుబేరుని పూజించడం సంపదల వృద్ధికి శుభప్రదం అని నమ్ముతారు. బంగారం, వెండి వస్తువులు కొనడం కూడా ఈ రోజున జరుగుతుంది. వివాహాలు, గృహప్రవేశాలు వంటి ముహూర్తాల కోసం ఈ రోజును ఎంపికచేసుకుంటారు.
దానధర్మాల ప్రాధాన్యం
అక్షయ తృతీయ రోజున దానం చేయడం మహత్తరమైన ఆచారం. పేదలకు ధాన్యం, వస్త్రాలు, నిత్యావసరాలు దానం చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ విధంగా దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యఫలం లభిస్తుంది.అందుకే అక్షయ తృతీయను భక్తి, శ్రద్ధలతో జరుపుకోవాలని పెద్దలు చెప్పడం మనం తరచూ వింటున్నాం. ప్రతి మనిషీ ఈ పవిత్ర దినాన సంపద, శ్రేయస్సు కోరుతూ మంచి కార్యక్రమాలను ప్రారంభించాలి. అక్షయ తృతీయ పర్వదినం అందరికీ శుభం తీసుకురావాలని కోరుకుందాం!