డిజిటల్ యుగంలో సాంకేతికత వల్ల లాభాలే కాకుండా నష్టాలు కూడా తీవ్రమవుతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు (Cyber Crimes) కొత్త కొత్త పంథాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ మోసాలు ప్రపంచవ్యాప్తంగా ఒక తీవ్రమైన సమస్యగా మారాయి. పలు ప్రముఖ సంస్థల డేటాలను కూడా సైబర్ నేరగాళ్లు సులభంగా లీక్ చేయగలుగుతున్నారు.
సైబర్ ప్రపంచంలో భారీ కలకలం
తాజాగా యాపిల్ (Apple).. ఫేస్‌బుక్ (Facebook).. గూగుల్ (Google).. వంటి ప్రముఖ సంస్థలకు చెందిన 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు లీక్ (Mega Data Breach) అయినట్లు సైబర్ భద్రతా పరిశోధకులు పేర్కొన్నాయి. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద డేటా లీక్ ఉల్లంఘనల్లో ఒకటిగా తెలిపాయి. మే 23న విడుదలైన ఫోర్బ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం.. యాపిల్, ఫేస్‌బుక్, గూగుల్, గిట్‌హబ్, టెలిగ్రామ్, ఇతర ప్రభుత్వ వెబ్‌సైట్ల యూజర్ల లాగిన్ వివరాలు లీక్ అయినట్లు తెలిపింది. వివిధ రకాల సామాజిక మాధ్యమాల ఖాతాలు, టెక్ సంస్థల యూజర్ల పాస్‌వర్డ్‌లు సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.
గతంలో ఇదే తరహా సంఘటనలు
గతంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు చెందిన 184 మిలియన్ల యూజర్ల లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లు లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు పేర్కొనగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 16 బిలియన్‌లకు చేరిందని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. నివేదికల ప్రకారం.. సైబర్ భద్రతా పరిశోధకులు మొత్తం 30 డేటాసెట్‌లను
కనుగొన్నారు. ఒక్కో డేటాసెట్‌లో 3.5 బిలియన్ రికార్డులు ఉన్నట్లు గుర్తించారు. సోషల్ మీడియా (VPN)వీపీఎన్ లాగిన్‌లతో పాటు వివిధ కార్పొరేట్ డెవలపర్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగిఉన్న సంస్థలకు చెందిన ఖాతాలలో 2025 ప్రారంభం నుంచి లాగిన్ అయిన అన్ని ఖాతాల వివరాలు వీటిలో రికార్డ్ అవుతున్నట్లు తెలిపారు.
గూగుల్ తీసుకుంటున్న జాగ్రత్తలు
ఇటువంటి డేటా ఉల్లంఘనలను తప్పించుకోవడానికి గూగుల్ (Google) తన వినియోగదారులకు పాత సైన్‌ఇన్ పద్ధతులను మార్చి, మెయిళ్ల ద్వారా ఖాతాల భద్రతను అప్‌గ్రేడ్ చేయాలని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే గూగుల్ తన వినియోగదారులు వారి ఖాతాలపై మెరుగైన నియంత్రణ ఏర్పరుచుకోవడం కోసం ఖాతాలను పాస్‌కీలకు, సోషల్ సైన్-ఇన్‌లకు అప్‌గ్రేడ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
పాస్‌కీలు అంటే..
పాస్‌కీలు అనేది స్మార్ట్‌ఫోన్ వంటి వాటి ద్వారా బయోమెట్రిక్ ప్రామాణీకరణతో పాస్‌వర్డ్‌లను భర్తీ చేసే లాగిన్ సిస్టమ్. గూగుల్ పాస్‌కీలను ‘ఫిషింగ్ రెసిస్టెంట్’గా చూస్తోంది. ఇది వినియోగదారులు వారి పరికరాలను అన్‌లాక్ చేయడానికి వేలిముద్ర, ముఖ స్కాన్ వంటివి ఉపయోగించుకొని లాగిన్ అవ్వడానికి సహాయపడుతుంది.
మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పాస్‌వర్డ్‌లు తరచూ మార్చడం. రెండు దశల ధృవీకరణ (2FA) అమలు. అనుమానాస్పద ఈమెయిల్స్/లింక్స్ క్లిక్ చేయకపోవడం. పబ్లిక్ Wi-Fi వాడకపోవడం. సురక్షిత VPN సేవలు ఉపయోగించడం.