బెంగళూరులో జరిగిన తొక్కిసలాట (Stampede ) ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. విజయోత్సవం సందర్భంగా ఏర్పడ్డ భద్రతా లోపాల వల్ల 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికర ఘటనగా మారింది. ఇది కేవలం ఒక ట్రాజెడీ కాదు, దేశంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం కలిగించిన అతి పెద్ద క్రీడా, ప్రజా సమూహ ఘటనల సరళిలో స్థానం సంపాదించింది. ఫ్యాన్స్ ఉత్సాహం ప్రాణహానికీ దారితీయడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.
కోల్కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన ఘటన
ఈ ఘటనతో దేశ చరిత్రలో మరో మరిచిపోలేని దుర్ఘటన గుర్తుకొస్తోంది. 1980 ఆగస్ట్ 16న కోల్కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ (Kolkata football tragedy) సందర్భంగా రెండు జట్ల అభిమానులు గొడవ పడ్డారు. ఈ తోపులాట, ఆందోళనల్లో 16 మంది మరణించడం అప్పట్లో దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది. అదే ఏడాది జరిగిన ఈ ఘటన ‘ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీ’లోనే అత్యంత విషాదకర ఘటనగా నమోదైంది. ఇక 1969లో ఆస్ట్రేలియా-ఇండియా టెస్ట్ మ్యాచ్ టికెట్ల కోసం ఎదురైన తొక్కిసలాటలో 6 మంది మృతి చెందడం ఇంకొక ఉదాహరణ.
భద్రత లోపల వల్లే ఇలాంటి ప్రమాదాలు
ఇవన్నీ చూస్తే.. పెద్ద ఇవెంట్ల నిర్వహణలో భద్రత, ప్రణాళికలలో ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వాలు, నిర్వాహకులు, భద్రతా వ్యవస్థలు క్రీడా, వినోద కార్యక్రమాలను సజావుగా నడిపించాలంటే భద్రతపై అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిసారి ఈ తరహా ఘటనల తర్వాత మాత్రమే స్పందించడం కాదు, ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణాలు కాపాడే ప్రయత్నాలు జరగాలి. లేదంటే అభిమానుల ఉత్సాహం ఒక విషాదానికి దారి తీస్తూనే ఉంటుంది.
Read Also : Jobs : CISFలో 403 ఉద్యోగాలు.. రేపే లాస్ట్