తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ (VIjay) నిర్వహిస్తున్న సభల్లో వరుసగా తొక్కిసలాటలు(Stampede ) జరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో మధురైలో విజయ్ తన మొదటి సభ నిర్వహించినప్పుడు కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, సుమారు 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అప్పటికే భద్రతా ఏర్పాట్ల లోపాలపై ప్రభుత్వ యంత్రాంగం, నిర్వాహకులు ప్రశ్నించబడేలా చేసింది.
TVK Rally Stampede : పదుల సంఖ్యలో చిన్నారుల అదృశ్యం..తల్లిదండ్రుల కన్నీరు
ఇప్పుడు కరూర్(Karur Tragedy)లో జరిగిన సభలో మాత్రం పరిస్థితి మరింత విషమంగా మారింది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 33 మంది మృతి చెందగా, 50 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సభలో ఊహించని రీతిలో ప్రజలు భారీగా తరలివచ్చినందున గుంపును నియంత్రించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా రక్షణ ఏర్పాట్లు సరిగా లేకపోవడం, తగినంత ప్రాంగణం లేకపోవడం తొక్కిసలాటకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
ఈ ఘటనలతో విజయ్ నిర్వహిస్తున్న రాజకీయ కార్యక్రమాలపై భద్రతా ప్రమాణాలు, నియంత్రణా చర్యలు ఎంత వరకు పాటిస్తున్నారనే ప్రశ్నలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు రావడం ముందే ఊహించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం, నిర్వాహకులు కలసి కఠిన మార్గదర్శకాలు అమలు చేయాలని సామాజిక వర్గాలు కోరుతున్నాయి.