Sitarama Sagar: సీతమ్మ సాగర్(దుమ్ముగూడెం) బ్యారేజీ నిర్మాణాన్ని మూడేళ్లలోపు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ బ్యారేజీ పూర్తయితే 500 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. శుక్రవారం మంత్రి ఉత్తమ్ నివాసంలో సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష జరిగింది. భవిష్యత్‌లో కృష్ణా జలాలు తగ్గితే సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణ.. సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ
జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తయితే పాలేరు రిజర్వాయర్‌కు గోదావరి నీళ్లు చేరి.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కూడా సీతారామ వరదాయినిగా మారుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టులో నాలుగో పంప్‌హౌస్ నిర్మాణాన్ని కూడా ఈ ఏడాదిలో పూర్తి చేయాలని నిర్దేశించారు. ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణీత వ్యవధిలోగా పనులు చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. సీతారామ ఎత్తిపోతల పథకంలోని సత్తుపల్లి విభాగం పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రాజెక్ట్ నాణ్యత, ఖర్చుల సమీక్ష
ఈ సమావేశంలో సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్ పురోగతి, భూసేకరణ, ఖర్చు, నాణ్యత మరియు భవిష్యత్ ప్రణాళికలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం సత్తుపల్లి ట్రంక్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, మిగిలిన పనుల పురోగతిని సమీక్షిస్తూ, ప్రాజెక్ట్ నాణ్యత, ఖర్చుల సమీక్ష, పని వేగం తదితర అంశాలను విశ్లేషించారు. జూలూరు పాడు టన్నెల్ పూర్తయితే పాలేరు రిజర్వాయరు.. గోదావరి నీళ్ళు చేరితే భవిష్యత్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సీతారామ వర ప్రదాయనిగా మారుతుందని వివరించారు.