జీఎస్టీ శ్లాబ్‌లలో(GST Slab) మార్పులు అమల్లోకి వచ్చిన తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయని సామాన్యులు ఆశించారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, కిరాణా సరుకులు, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిలో ధరలు క్షీణిస్తాయని ఊహించారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సూపర్ మార్కెట్లు, రిటైల్ షాపులు పాత స్టాక్‌ను పాత ధరలకే విక్రయిస్తున్నాయి. దీని వలన వినియోగదారులు తగ్గిన ధరల లాభం పొందలేక నిరాశ చెందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా “కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన వెంటనే, పాత వస్తువులపై కూడా MRP మార్చి, తగ్గిన ధరలతో విక్రయించాలి” అని ఆదేశాలు జారీ చేసినా, అవి ప్రాక్టికల్‌గా అమలవడం లేదు. దుకాణదారులు, సూపర్ మార్కెట్ నిర్వాహకులు మాత్రం “పాత స్టాక్ పూర్తవ్వగానే, కొత్త రేట్లు ప్రతిబింబిస్తాయి” అంటూ తప్పించుకుంటున్నారు. ఈ విధానం వినియోగదారుల హక్కులను నేరుగా ఉల్లంఘించడం కాగానే, పన్ను సంస్కరణల ఉద్దేశ్యాన్ని కూడా నీరుగారుస్తోంది.
దీంతో వినియోగదారులు మోసపోతున్నామన్న భావన కలుగుతోంది. తగ్గిన ధరల ప్రయోజనం వెంటనే అందకపోవడం వల్ల సంస్కరణలపై ప్రజల్లో ప్రతికూలత పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఫీల్డ్ స్థాయిలో తనిఖీలు చేపట్టి, పాత స్టాక్‌పైనా MRP రివిజన్ తప్పనిసరి చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే జీఎస్టీ రిఫార్మ్స్ అన్నీ కేవలం “పేపర్‌పై ఉన్న మాటలు గానే మిగిలిపోతాయని వారి ఆవేదన.