ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (Sharmila ) తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్నూలులోని ఉల్లి రైతులను పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరిన షర్మిల, తనతో పాటు కుమారుడు రాజారెడ్డిని కూడా తీసుకువెళ్లారు. రాజారెడ్డి(Rajareddy)కి ఇదే తొలి రాజకీయ యాత్ర. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఆయన అమ్మమ్మ వై.ఎస్. విజయమ్మ కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడికి అందించడానికి షర్మిల వ్యూహరచన చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
కుమారుడి ద్వారా వైవిధ్యమైన వర్గాలను ఆకర్షించే వ్యూహం
విదేశాలలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న రాజారెడ్డిని ఏపీ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయించాలని షర్మిల వర్గం ప్రణాళికలు రచిస్తోంది. తల్లి వైపు నుంచి రెడ్డి, తండ్రి ద్వారా బ్రాహ్మణ వర్గాలను, అలాగే క్రిస్టియన్ వర్గాలను కూడా రాజారెడ్డి ద్వారా పార్టీ వైపు ఆకర్షించవచ్చని షర్మిల ఆలోచిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ విషయంలో షర్మిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోయినా, జగన్ ఓటమిలో తమ పాత్ర ఉందని షర్మిల వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలో, తమ పార్టీని బలోపేతం చేయడానికి రాజారెడ్డి రాక ఒక కీలక అంశంగా చూడవచ్చు.
పురుషాధిక్యత భావనను ఉపయోగించుకుంటున్న షర్మిల
సాధారణంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వారసత్వం పురుషులకే ఎక్కువగా దక్కుతుందన్న భావన ఉంది. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి కుమారులు లేకపోవడం, ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉండటంతో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వం తన కుమారుడికే దక్కుతుందని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ దిశగా కుమారుడు రాజారెడ్డిని సిద్ధం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. షర్మిల ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజారెడ్డి ఎలా నిలబడతారో వేచి చూడాలి.