అస్సాం సంగీత ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన జుబీన్ గార్గ్ మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆయన అంత్యక్రియలకు (Final Journey) హాజరైన జనసంద్రం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద అంత్యక్రియల గ్యాదరింగ్‌గా దీనిని గుర్తించారు. మైఖేల్ జాక్సన్, పోప్ జాన్ పాల్ II, క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఇంతటి పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక కళాకారుడి అంతిమ వీడ్కోలు కార్యక్రమానికి హాజరవడం విశేషమని లిమ్కా బుక్ పేర్కొంది.
గువాహటి నగరమే శోకసంద్రం
జుబీన్ గార్గ్ (Zubeen Garg) అంత్యక్రియల రోజున గువాహటి నగరం పూర్తిగా విషాదంలో మునిగిపోయింది. ఆయనను చూసేందుకు, చివరి వీడ్కోలు పలకడానికి లక్షలాది మంది అభిమానులు, కళాకారులు, రాజకీయ నాయకులు తరలివచ్చారు. భారీ రద్దీ కారణంగా నగరంలో దుకాణాలు మూసివేయబడగా, ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. కన్నీటితో ఆయనకు వీడ్కోలు పలికిన అభిమానులు గువాహటిని శోకసంద్రంగా మార్చేశారు.
సంగీత వారసత్వానికి గౌరవం
జుబీన్ గార్గ్ అస్సాంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సంగీతానికి చేసిన కృషి అమూల్యం. ఆయన గళం అనేక తరాల హృదయాలను తాకింది. అంత్యక్రియలకు హాజరైన ప్రజల సంఖ్య ఆయనకు ఉన్న అపారమైన ప్రజాదరణకు నిదర్శనం. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన అంత్యక్రియలకు చోటు దక్కడం కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు, సంగీత రంగానికి ఆయన అందించిన సేవలకు దేశం మొత్తంగా నివాళి అర్పించినట్టే అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.