గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షం (Rain) జనజీవనాన్ని స్తంభింపజేసింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖాజాగూడలో 12 సెం.మీ., ఎస్‌ఆర్ నగర్‌లో 11 సెం.మీ., ఖైరతాబాద్‌లో 11 సెం.మీ., సరూర్‌నగర్‌లో 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సాధారణంగా నగరంలో ఉండే ట్రాఫిక్ జామ్ సమస్యకు తోడు, ఈ భారీ వర్షం వల్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపైనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన చాలామంది ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణాన్ని మానుకొని, సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మెట్రో రైలు(Metro)ను ఆశ్రయించారు.
కిక్కిరిసిపోయిన మెట్రో
దీంతో నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ప్రయాణికులు టికెట్ల కోసం, రైలు ఎక్కడం కోసం క్యూ కట్టారు. దీంతో మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. వర్షం కారణంగా రోడ్డు మార్గాల్లో ప్రయాణించడం కష్టంగా మారడంతో, మెట్రో రైళ్లే అత్యంత సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సాధనంగా నిలిచింది. ఇది హైదరాబాద్‌లో వర్షం పడినప్పుడు ప్రజలు ప్రయాణానికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటారో స్పష్టం చేస్తుంది.
Read Also : Sangeetha: విడాకుల వార్తపై స్పందించిన సినీ నటి సంగీత