లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓట్ల దొంగతనం’ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా స్పందించింది. రాహుల్ ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ, తన ఆరోపణలు నిజమని నమ్మకం ఉంటే ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఈసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఫ్యాక్ట్ చెక్’ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ తమ ఆరోపణలపై నమ్మకం లేకపోతే, అర్థరహితమైన అభిప్రాయాలకు వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని ఈసీఐ రాహుల్‌కు హితవు పలికింది.
రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో, ముఖ్యంగా మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీ ఎత్తున ఎన్నికల మోసం జరిగిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అవకతవకలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. బెంగళూరు సెంట్రల్‌లో బీజేపీకి 32,707 ఓట్ల ఆధిక్యం రాగా, ఒక్క మహదేవపురలోనే ఆ పార్టీకి 1,14,046 ఓట్ల భారీ ఆధిక్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ ఒక్క సెగ్మెంట్‌లోనే దాదాపు 1,00,250 ఓట్లను దొంగిలించారని, ఈసీఐ బీజేపీతో కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు.
రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. రాహుల్, ఆయన బృందం చేస్తున్న వాదనలు నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని విమర్శించారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తమకు అనుకూలంగా తీర్పులు రానప్పుడు రాజ్యాంగ సంస్థలను కించపరచడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని రిజిజు వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా సవరణ అనేది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియేనని, ఇందులో కొత్తగా జరుగుతున్నదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
Read Also : TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ