బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) మాట్లాడుతూ.. తాను ఐదు నెలల పాటు జైల్లో గడిపి బయటకు వచ్చిన తరువాత ఎన్నో ప్రజా సమస్యలపై గళమెత్తానని తెలిపారు. బలహీన వర్గాల కోసం తన కృషిని కొనసాగించానని ఆమె స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపడమే తన ధ్యేయమని కవిత అన్నారు.
గురుకులాలు, బీసీ రిజర్వేషన్లపై ఉద్యమం
గురుకులాల సమస్యలపై మొట్టమొదటగా తానే మాట్లాడానని కవిత పేర్కొన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టానని, 42 శాతం రిజర్వేషన్ల కోసం తీవ్రంగా పోరాడానని ఆమె గుర్తుచేశారు. ఇవన్నీ సమాజానికి మేలు చేసే అంశాలేనని, వాటిని వ్యతిరేక చర్యలుగా ఎందుకు చూపుతున్నారో బీఆర్ఎస్ పెద్దలు చెప్పాలని ప్రశ్నించారు.
మహిళల హక్కులు, బనకచర్ల సమస్యలపై గళమెత్తిన కవిత
మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వాలన్న డిమాండ్‌తోపాటు, బనకచర్ల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన విషయాన్ని కవిత వివరించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీసీల కోసం మాట్లాడితే దుష్ప్రచారం చేస్తారని ఆరోపిస్తూ, తమ కృషిని తప్పుదోవ పట్టించడం అన్యాయం అని కవిత అన్నారు.