అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాల (H1B Visa) ఫీజులను భారీగా పెంచిన నేపథ్యంలో AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నిర్ణయం భారత విదేశాంగ విధానం వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కేవలం ఘనకార్యాలు, ప్రదర్శనలు, ఆర్భాటపు సభలతో విదేశాంగ విధానం విజయవంతమవుతుందని భావించడం తప్పని అన్నారు. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం భారతీయులపై, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్తున్న వేలాది ఐటీ నిపుణులపై తీవ్రమైన ప్రభావం చూపనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులు హెచ్-1బీ వీసాల్లో 71-72 శాతం వాటా పొందుతున్నప్పటికీ, వారి ప్రయోజనాలను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
ఓవైసీ వివరించిన ప్రకారం.. అమెరికాలో భారతీయుల సగటు వార్షిక ఆదాయం సుమారు 1.20 లక్షల డాలర్లు (రూ.1.05 కోట్లు) ఉండగా, భారత్‌కు వచ్చే రిమిటెన్స్‌లో పెద్ద భాగం తెలుగు రాష్ట్రాల నుంచే వస్తోంది. మొత్తం 125 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ ఆదాయంలో 37 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసుల ద్వారానే వస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో అమెరికా విధానాలు ఈ రెండు రాష్ట్రాల ప్రజల జీవనోపాధిని నేరుగా దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. ట్రంప్ కోసం మోదీ గతంలో నిర్వహించిన హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాలను ఓవైసీ ప్రస్తావిస్తూ, ఆర్భాటపు ఈవెంట్లతో దేశ ప్రయోజనాలు కాపాడలేమని మండిపడ్డారు. అమెరికా భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణించడం లేదని, పాకిస్తాన్, సౌదీ అరేబియాతో ఒప్పందాలు చేస్తూ భారత్‌ను ఒంటరిని చేసిందని ఆయన ఆరోపించారు.
ఇక భారత్ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే పరిష్కారమని ఓవైసీ సూచించారు. ఇప్పటికే భారత్ 18 దేశాలతో డీడాలరైజేషన్ ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, వాటిని మరింత విస్తరించాలని అన్నారు. ట్రంప్ చేస్తున్న బెదిరింపులకు మోదీ సర్కార్ తలొగ్గకూడదని, దేశ భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం పణంగా పెట్టొద్దని హెచ్చరించారు. 2014 నుంచి 2024 వరకు భారత విదేశాంగ విధానం దారుణంగా వెనకబాటుకుపోయిందని, ఇది ఒక నష్టపోయిన దశాబ్దంగా గుర్తుంచుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. విదేశాంగ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసి, దేశ ప్రజల ప్రయోజనాలను ముందుంచి వ్యవహరించాలని ఓవైసీ హితవు పలికారు.