తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుకు ప్రత్యేక విచారణ బృందం (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు తన విచారణ పరిధిని మరింత విస్తరించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు అందాయి. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఈ కేసులో పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు అరెస్ట్ కాగా, ఇప్పుడు నేరుగా ఒక కీలక రాజకీయ నాయకుడికి నోటీసులు రావడం గమనార్హం.
BRS re entry : బీఆర్ఎస్‌లోకి రీఎంట్రీ? మహిపాల్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్!
హరీశ్ రావుకు నోటీసులు ఇవ్వడం వెనుక ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ఇచ్చిన స్టేట్మెంట్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం లేదా ఆ ప్రక్రియలో జరిగిన కొన్ని అంతర్గత విషయాలపై సదరు ఎండీ ఇచ్చిన వాంగ్మూలంలో హరీశ్ రావు పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. దీనిపై స్పష్టత కోసమే సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. గతంలో అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారాన్ని, ఈ కొత్త స్టేట్మెంట్‌ను బేరీజు వేస్తూ అధికారులు ప్రశ్నల జాబితాను సిద్ధం చేసినట్లు భోగట్టా.
ప్రస్తుతం హరీశ్ రావు ఈ విచారణకు హాజరవుతారా లేక న్యాయపరమైన సలహాలు తీసుకుని గడువు కోరుతారా అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఆయన విచారణకు హాజరైతే, అది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ఈ కేసు కేవలం అధికారులకే పరిమితం కాకుండా, రాజకీయ అగ్రనేతల వైపు మళ్లుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు, అధికార పక్షం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com