తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservation) అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ఎలాంటి వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. ఎవరి హక్కులకు భంగం కలిగించకుండా, చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు.
ఈ సందర్భంలో రిజర్వేషన్లపై ఎవరైనా అడ్డుపడితే ఉద్యమం తప్పదని పొన్నం ప్రభాకర్ (Ponnnam Prabhakar) హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటామంటే బీసీ సమాజం ఊరుకోకూడదని పిలుపునిచ్చారు. ఇది కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదు, బీసీ వర్గాల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణకు తీసుకున్న అడుగని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బలహీన వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు కల్పించడమే సమానత్వానికి మూలస్థంభమని స్పష్టం చేశారు.
Mounika: పంక్చర్ షాప్ ఓనర్ కూతురు డీఎస్పీ జాబ్ కొట్టింది
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఆ వర్గాల ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా స్థాయి వరకు బీసీ వర్గాల నాయకత్వాన్ని ఎదిగించడానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్లపై ఎటువంటి అడ్డంకులు తలెత్తినా ప్రభుత్వం దృఢంగా నిలబడుతుందని, బీసీల హక్కుల విషయంలో రాజీ ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.