తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్(BRS) పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Kavitha Vs Jagadeesh )కి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామాలు గులాబీ పార్టీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. కవిత చేసిన సంచలన ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. ఆమె జగదీష్ రెడ్డిని ఉద్దేశించి, “లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు. కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు.. ఎన్నడూ ప్రజా పోరాటాల్లో పాల్గొనలేదు. అసలు బీఆర్‌ఎస్‌తో మీకేం సంబంధం?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తనపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్న వారి వెనుక బీఆర్‌ఎస్‌లో పెద్ద నాయకులే ఉన్నారని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతానని కవిత హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించకపోవడంపై కూడా ఆమె పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
జగదీష్ రెడ్డి కౌంటర్
కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి అదే రీతిలో స్పందించారు. “నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ (KCR) శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లె వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల ఒక టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ, కవిత గురించి తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఆమె పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమేనని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపైనే కవిత ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీఆర్‌ఎస్ భవిష్యత్తుపై ప్రభావం
కవిత, జగదీష్ రెడ్డి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం బీఆర్‌ఎస్ పార్టీలో పెద్ద కుదుపుకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టానం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి బహిరంగ విమర్శలు పార్టీలోని వర్గ విభేదాలను మరింత పెంచే అవకాశాలు లేకపోలేదు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయంలో, సొంత పార్టీ నాయకుల మధ్యే ఇలాంటి మాటల తూటాలు పేలడం బీఆర్‌ఎస్ ప్రతిష్టకు నష్టం కలిగించవచ్చు. ప్రజల్లో పార్టీపై విశ్వాసం సన్నగిల్లే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాలు బీఆర్‌ఎస్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.
Read Also : NPPA: మధుమేహం, బీపీ మందుల ధరలపై కేంద్రం ఊరట