ఎన్నికల సిబ్బందికి శిక్షణనూ పూర్తిచేయండి.. డైరెక్టర్ సృజన
హైదరాబాద్: స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అధికారులకు స్పష్టం చేశారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం.. శనివారం రాష్ట్రంలోని 570 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాల పరిధిలో నిర్ధారించిన పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించాలని ఆదేశించారు. శుక్రవారం జడ్పీ సీఈవోలు, డీపీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేయడంతోపాటు ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను కూడా కొనసాగించాలన్నారు.

పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొని, సిద్ధంగా ఉండాలని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని.. న్యాయస్థానం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలని, ఊళ్లన్నీ పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన గ్రామాల పరిధిలో ఇంటి పన్ను హేతుబద్ధీకరణపై దృష్టి పెట్టాలన్నారు. పంచాయతీలకు రావాల్సిన పన్నులను రాబట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు.