సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయంగా క్రియాశీలకమయ్యారు. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల అంశాన్ని అస్త్రంగా చేసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచే తన పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
రెండేళ్ల మౌనం తర్వాత కేసీఆర్ నేరుగా ప్రజాక్షేత్రంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకా నుంచే పోరాటం మొదలుపెట్టడం వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో స్థానిక నేతలతో భేటీ అయ్యి, భారీ బహిరంగ సభ ద్వారా తన గళాన్ని వినిపించనున్నారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ (KRMB) కి అప్పగించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, నీటి వాటాల విషయంలో కేంద్రంలోని బీజేపీని నిలదీయడమే లక్ష్యంగా ఈ పోరాటం సాగనుంది. తద్వారా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలపై ఏకకాలంలో ఒత్తిడి పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారు.
కేసీఆర్ కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే కాకుండా, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కూడా యుద్ధం ప్రకటించారు. నదీ జలాల పంపిణీలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కేంద్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని దుయ్యబట్టారు. ఢిల్లీ స్థాయిలో బీజేపీతో పోరాడుతూనే, గల్లీ స్థాయిలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా తన రాజకీయ ఉనికిని మరియు పార్టీ కేడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం నీటి పోరాటం మాత్రమే కాకుండా, రాబోయే ఎన్నికలకు సిద్ధమయ్యే దిశగా వేస్తున్న అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన “ఆరు గ్యారంటీలు” మరియు ఇతర హామీలను నమ్మి ప్రజలు టెంప్ట్ అయ్యి ఓటు వేశారని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేసీఆర్ మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, మరియు పెన్షన్ల పెంపు వంటి అంశాల్లో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చని ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, త్వరలోనే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందని ఆయన హెచ్చరించారు. పాలమూరు సభ ద్వారా అటు నీటి సమస్యను, ఇటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా రాజకీయంగా తిరిగి పుంజుకోవాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com