ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 3 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సెప్టెంబర్ 5 నాటికి పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా తీరాల వైపు ప్రయాణించి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ వాయుగుండం ప్రభావంతో తీర ప్రాంతాల్లో మరియు లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలతో పాటు, ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున, తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ అధికారులు సూచించారు. ఈ అల్పపీడనం వల్ల వరదలు, రహదారుల మూసివేత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అంతేకాకుండా సెప్టెంబర్ రెండో వారంలో కూడా వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీని వల్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యల కోసం బృందాలను సిద్ధం చేయడం వంటివి చేస్తున్నారు. ప్రజలు కూడా వాతావరణ శాఖ ఇచ్చే సూచనలను పాటించి సురక్షితంగా ఉండాలని అధికారులు కోరారు.