స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari )తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇదే విషయాన్ని చెప్పానని, ఇప్పుడు కూడా తన నిర్ణయం మారలేదని ఆయన స్పష్టం చేశారు. “ఇవే నా చివరి ఎన్నికలు. ఇకపై పోటీ చేయను” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
తన నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడుతూ ..గత రెండేళ్లలోపే రూ.1,025 కోట్ల నిధులు తెచ్చి పలు పనులు పూర్తి చేశానని చెప్పారు. ఇంకా త్వరలోనే మరో రూ.2 వేల కోట్ల నిధులు కూడా తెచ్చే ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. తన పాలనలో చిల్లర పనులు చేయలేదని, చిలిపి చేష్టలకు తాను పాల్పడలేదని హామీ ఇచ్చారు. అభివృద్ధి ప్రధాన అజెండాగా పనిచేసిన విషయాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

ఇక తన రాజకీయ ధోరణి గురించి మాట్లాడుతూ.. “తప్పు చేయను, తల వంచను” అని స్పష్టంగా అన్నారు. అంటే, తన రాజకీయ ప్రయాణంలో ఎలాంటి అవినీతి లేదా తప్పు నిర్ణయాలకు చోటు ఇవ్వలేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ప్రజలకు అభివృద్ధి పనులు అందించడం ద్వారానే తన వంతు పాత్రను నెరవేర్చానని కడియం శ్రీహరి పేర్కొన్నారు. దీంతో స్టేషన్ ఘన్పూర్‌లో ఆయన వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు, అక్కడి రాజకీయ సమీకరణాలు ఎటు దిశగా వెళ్తాయి అన్నదానిపై చర్చలు మొదలయ్యాయి.