ఉత్తరప్రదేశ్‌లో భార్య మరియు అత్తమామల వేధింపులకు తాళలేక మోహిత్ యాదవ్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బెంగళూరులో ఫీల్డ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న మోహిత్, ప్రియా అనే యువతితో ఏడేళ్ల ప్రేమ అనంతరం రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కొంతకాలం బాగానే ఉన్న ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. భార్య ప్రవర్తనతో పాటు ఆమె కుటుంబం నుంచి ఎదురయ్యే మానసిక వేధింపులు మోహిత్‌పై తీవ్ర ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.
భార్య గర్భంతో ఉన్న సమయంలో అత్త అబార్షన్
మొత్తానికి భార్య గర్భంతో ఉన్న సమయంలో అత్త అబార్షన్ చేయించడం, తన ఆభరణాలు బలవంతంగా తీసుకెళ్లడం, ఆస్తులను భార్య పేరుపై బదిలీ చేయాలని ఒత్తిడి, చివరికి తప్పుడు కేసులతో బెదిరింపులు – ఇవన్నీ మోహిత్‌ను ఆత్మహత్య దిశగా నడిపించాయి. తన ఆవేదనను వీడియో రూపంలో రికార్డ్ చేసి, ‘అమ్మా నాన్నా క్షమించండి’ అంటూ భావోద్వేగంతో మాట్లాడిన ఆయన చివరకు ఒక హోటల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు
ఈ వీడియోను బంధువులకు పంపిన తర్వాత జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోహిత్ చేసిన ఆరోపణలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడుల నేపథ్యంలో పోలీసులు వివరణ తీసుకుంటున్నారు. ఈ ఘటన మానవ సంబంధాల్లో నమ్మకం, ప్రేమ, ఒత్తిడులు, కుటుంబ మద్దతు వంటి అంశాలపై సమాజానికి కొత్త ఆలోచనల తలుపులు తెరిచింది.