ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వచ్చినప్పటికీ, జూన్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (Rains) పెద్దగా కురవలేదు. దీంతో వర్షాలపై పెట్టుకున్న ఆశలు నెరవేరక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పత్తి, నారు వేసిన తరువాత వర్షాలు లేకపోవడంతో పంటల పై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. అయితే గత వారం రోజులుగా కాస్త కొద్ది కొద్ది వర్షాలు కురుస్తుండటంతో రైతులు మళ్లీ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు.
రాబోయే రోజుల్లో వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరిక
భారత వాతావరణ శాఖ ప్రకారం.. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం మరియు ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజులలో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీచే ప్రమాదం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాలు, పొలాల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి
తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో జూలై 9 నుంచి 11 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా చెట్ల కింద నిలబడరాదని, పిడుగుల ప్రమాదం అధికంగా ఉంటుందని సూచించారు. రైతులు ఈ రెండు మూడు రోజులు పొలాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా అప్రమత్తమై ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలకు సంబంధించి అధికారిక సమాచారాన్ని పాటిస్తూ స్వీయ భద్రత కాపాడుకోవాలి.
Read Also : Chandrababu Naidu: పుట్టపర్తి విద్యార్థులకు పాఠాలు చెప్పిన చంద్ర బాబు