జమ్మూ కాశ్మీర్‌లో కురిసిన అతివృష్టి, వరదలు(J&K Floods), కొండచరియల విరిగిపడటం తీవ్ర విషాదానికి దారితీసింది. దోడా జిల్లాలో మేఘవిస్ఫోటం కారణంగా కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక ఇంటి కూలిపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయారు. వైష్ణోదేవి ఆలయం మార్గంలోని అర్ధక్వారిలో కొండచరియలు విరిగిపడటంతో పలువురు భక్తులు గాయపడి, కొందరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
రహదారులు, రైలు మార్గాలు నిలిచిపోయిన పరిస్థితి
భారీ వర్షాలతో దోడా-కిష్త్వార్‌ను కలిపే జాతీయ రహదారి NH-244 దెబ్బతింది. రాంబన్ జిల్లాలో రాళ్లు జారిపడటంతో శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారి మూసివేయబడింది. సింథన్ టాప్, జోజిలా పాస్ వద్ద కురిసిన వర్షం, మంచు కారణంగా ప్రధాన మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, శ్రీశక్తి ఎక్స్‌ప్రెస్, హేమకుంట్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు అనేక రైళ్లు రద్దయ్యాయి. అర్ధక్వారిలో భక్తులు గాయపడటంతో శ్రీమాత వైష్ణోదేవి ఆలయ బోర్డు స్పందిస్తూ, రక్షణ చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపింది. యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రభుత్వం చర్యలు, ప్రజలకు హెచ్చరికలు
ప్రస్తుత పరిస్థితిని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అత్యంత తీవ్రమైనదిగా పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించడానికి తాను జమ్మూకి వెళ్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లకు అత్యవసర పునరుద్ధరణ పనుల కోసం అదనపు నిధులు విడుదల చేశారు. టావి, రవి నదులు ప్రమాద స్థాయిని దాటడంతో అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. కఠువా జిల్లాలో రవి నది కరకట్టలు దాటి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. అధికారులు ప్రజలను నది తీరాలకు దూరంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.