ఈ డిజిటల్ యుగంలో పెరుగుతున్న అవసరాలు, అధిక ధరల కారణంగా లోన్లు తీసుకోవడం సర్వసాధారణమైంది. అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు అందించే పర్సనల్ లోన్లు (వ్యక్తిగత రుణాలు) చాలా మందికి మొదటి ఎంపికగా మారుతున్నాయి. అయితే పర్సనల్ లోన్ అనేది ‘అన్‌సెక్యూర్డ్ లోన్’ (ఎలాంటి తాకట్టు లేని రుణం) కాబట్టి వడ్డీ రేట్లు హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. అందుకే లోన్ తీసుకునే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అన్నింటికంటే ముఖ్యంగా, వివిధ బ్యాంకుల్లో ఉన్న వడ్డీ రేట్లను పోల్చుకుని, మీ ఆర్థిక స్థితికి సరిపోయే సరైన బ్యాంకును ఎంచుకోవడం తెలివైన పని. నిర్లక్ష్యం వహిస్తే అధిక వడ్డీ భారం, ఇతర ఛార్జీలు, క్రెడిట్ స్కోర్ పడిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్
పర్సనల్ లోన్ విషయంలో చేయకూడని ముఖ్యమైన పొరపాట్లు ఏమిటంటే.. ముందుగా, మీకు కచ్చితంగా ఎంత మొత్తం లోన్ కావాలో నిర్ణయించుకోవాలి. మీ స్థోమతను బట్టి ఎంత తీసుకోవాలో అంచనా వేయకుండా ఎక్కువ మొత్తం తీసుకోవడం ప్రమాదకరం. అనవసరంగా లోన్ తీసుకోవద్దు, వైద్య అవసరాలు, పై చదువులు, ఇంటి పునర్నిర్మాణం వంటి ముఖ్యమైన అవసరాల కోసమే తీసుకోవాలి. లగ్జరీ వస్తువులు, విలాసాల కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. లోన్ తీసుకున్న తర్వాత, ఈఎంఐ (EMI) చెల్లింపుల విషయంలో ఆలస్యం చేయకూడదు. ఏ ఒక్క పేమెంట్ మిస్ అయినా, ఆలస్యమైనా భారీ పెనాల్టీలు పడతాయి, ఇంకా క్రెడిట్ స్కోరు దారుణంగా పడిపోతుంది. చివరికి చట్టపరమైన చర్యలకు కూడా అవకాశం ఉంటుంది.
దీర్ఘకాలికంగా ఆర్థిక ఇబ్బందుల పాలు కాకుండా ఉండాలంటే, కొన్ని కీలక విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకేసారి ఒకటికి మించి పర్సనల్ లోన్ తీసుకునేందుకు ప్రయత్నించడం లేదా లోన్ కోసం ఎక్కువ సార్లు ప్రయత్నించడం క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది. లోన్ దరఖాస్తు తిరస్కరణకు గురైన ప్రతిసారీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. కాబట్టి, లోన్ అప్లై చేసే ముందు అర్హతలను, డాక్యుమెంట్లను సరిచూసుకోవాలి. అలాగే, కొన్ని బ్యాంకులు అందించే ప్రీపేమెంట్ (ముందస్తు చెల్లింపు) అవకాశాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. తద్వారా, మీ వద్ద అదనంగా డబ్బు ఉన్నప్పుడు స్వల్ప ఛార్జీలతో ముందస్తుగా లోన్ మొత్తం చెల్లించి, వడ్డీ భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే పర్సనల్ లోన్ అనేది అవసరానికి ఆసరాగా నిలుస్తుంది, లేదంటే అప్పుల సమస్యలకు దారితీస్తుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/