చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రమాదానికి ప్రధాన కారణాలు ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడమేనని ఆయన తెలిపారు. ఈ ఘటనపై రవాణా శాఖ ఉన్నతాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించి సమగ్ర సమీక్ష చేపట్టారు. రోడ్డు భద్రత అంశంలో నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రమాదాల నియంత్రణ కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. “జీవితాలు విలువైనవి, ఒక్క నిర్లక్ష్యం వందల కుటుంబాలపై ప్రభావం చూపుతుంది” అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News: CCI Recruitment: సీసీఐలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ ప్రారంభం
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తప్పనిసరి అని చెప్పారు. వాహనాల వేగ నియంత్రణపై (స్పీడ్ లాక్) వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. “స్పీడ్ లాక్‌ను ఉల్లంఘించినట్లు తేలితే, ట్రిపుల్ పెనాల్టీ విధించాలి. డ్రైవర్, వాహన యజమాని ఇద్దరికీ శిక్ష తప్పదు” అని స్పష్టం చేశారు. వాహనాల ఫిట్నెస్, పర్మిట్‌ల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఫిట్నెస్ లేకుండా రోడ్డుపైకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, పాత వాహనాల పరిశీలన, పాఠశాల బస్సులు, ప్రయివేట్ ట్రావెల్స్ వాహనాల సేఫ్టీ ఆడిట్‌ను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు.

మంత్రి పేర్కొంటూ, “ప్రజల ప్రాణాల రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. రవాణా శాఖ ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలి” అన్నారు. అన్ని జిల్లాల్లో ప్రమాదప్రాంతాల గుర్తింపు, రోడ్డు విస్తరణ, డివైడర్ ఏర్పాటు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. చెవెళ్ల ఘటనను పాఠంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని మంత్రి పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/