మొదలైన రైతు భరోసా నిధుల జమ

Read Time:  1 min
rythubharosa
rythubharosa
FONT SIZE
GET APP

ఇప్పటివరకు మూడు విడతల్లో కలిపి మొత్తం 44,82,265 మంది రైతులకు లబ్ధి

రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ప్రధానంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిధుల జమ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మూడు ఎకరాల విస్తీర్ణం వరకు సాగులో ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో 9,54,422 మంది రైతుల ఖాతాల్లో రూ.1230.98 కోట్లు జమయ్యాయి. అలాగే 2 ఎకరాల లోపు భూమి కలిగిన మరో 56,898 మంది రైతులకు రూ.38.34 కోట్ల నిధులు అందినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Rythu Bharosa for farmers who have less than 3 acres from today!

ఇప్పటివరకు మూడు విడతల్లో కలిపి మొత్తం 44,82,265 మంది రైతులకు లబ్ధి చేకూరింది. 58 లక్షల 13 వేల ఎకరాల భూమికి సంబంధించి రూ.3487.82 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం అందించడం ద్వారా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి 26న పైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రైతు భరోసా నిధుల పంపిణీని ప్రారంభించింది. అప్పటి నుంచి మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయడం జరుగుతోంది. మొదటి విడతలో 17.03 లక్షల మంది రైతులకు రూ.557.54 కోట్లు, రెండో విడతలో 13.23 లక్షల మందికి రూ.1091.95 కోట్లు, మూడో విడతలో 10.13 లక్షల మందికి రూ.1269.32 కోట్ల నిధులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం మిగిలిపోయిన రైతులకు కూడా త్వరలోనే నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు ఈ నిధులను తమ వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకోవాలని, ప్రభుత్వం నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా నిధులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఈ పథకం వల్ల రైతులు ఖర్చుల భారాన్ని తగ్గించుకోగలుగుతారని, వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. రైతు భరోసా నిధుల ద్వారా పంట ఉత్పత్తి పెంపొందడంతో పాటు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.