దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట (రెడ్ ఫోర్ట్) సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భయానక పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో పార్క్ చేసి ఉంచిన కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ క్షణాల్లోనే భయంకరమైన మంటలు ఎగసిపడగా, సమీపంలో ఉన్న మరికొన్ని వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, అనేక మందికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు ధృవీకరించారు. పేలుడు శబ్దం చాలా దూరం వరకు వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. దేశ స్వాతంత్ర్యానికి చారిత్రక ప్రతీక అయిన ఎర్రకోట వద్ద ఈ రకమైన ఘటన జరగడం భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Telugu News: RSS: భారత్ కు హాని చేయడమే పాక్ లక్ష్యం: మోహన్ భగవత్
పేలుడు సంభవించిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, సాధారణ ప్రజలను బయటకు తరలించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు, బాంబు నిర్వీర్య దళాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. కారు పేలుడు తీవ్రత అంతలా ఉందని, వాహనం భాగాలు దాదాపు 100 మీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడ్డాయని అధికారులు తెలిపారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ నుంచి ఏడుగురు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. “మాకు ఎర్రకోట వద్ద భారీ పేలుడు శబ్దం వచ్చినట్లు సమాచారం వచ్చింది. అక్కడికి చేరుకున్నప్పుడు మంటలు భయంకరంగా వ్యాపించాయి. మూడు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి” అని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.
సీనియర్ పోలీసు అధికారులు, దర్యాప్తు బృందాలు ఇప్పటికే ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. పేలుడు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు కానీ, ఇది ప్లాన్ చేసిన చర్యనా లేదా సాంకేతిక లోపమా అన్నది దర్యాప్తు దశలో ఉంది. గాయపడిన వారిని తక్షణమే LNJP ఆసుపత్రికి తరలించారు. కంటి సాక్షుల ప్రకారం, “మేము దగ్గరికి వెళ్లేసరికి రోడ్డుపై శరీర భాగాలు, వాహన అవశేషాలు చెల్లాచెదురుగా కనిపించాయి. ఒక్కసారిగా ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు” అని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఢిల్లీ అంతటా భద్రతా స్థాయిని పెంచారు. ముఖ్యంగా పార్లమెంట్, అధ్యక్ష భవన్, అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భద్రతా తనిఖీలు కఠినతరం చేశారు. ఎర్రకోట పేలుడు ఘటన దేశ రాజధానిని మళ్లీ ఉలిక్కిపడేలా చేసింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/