Terrorist attack : జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో సరిహద్దును మూసివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం స్వల్పకాలిక వీసాలున్న వారికి కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు ఏప్రిల్ 27తో ముగిసింది. దీంతో ఇప్పటివరకు 537 మంది పాక్ జాతీయులు అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు తెలిపాయి.
ఒక్కరోజే 287 మంది పాక్ జాతీయులు వెళ్లిపోయారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ 24 నుంచి భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు దేశం వీడటం ప్రారంభించారు. తొలి మూడు రోజుల్లో పరిమిత సంఖ్యలో వెళ్లిపోగా.. ఆదివారం ఒక్కరోజే 287 మంది పాక్ జాతీయులు వెళ్లిపోయారు. కొంతమంది ఎయిర్‌పోర్టుల ద్వారా వెళ్లే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే, పాకిస్థాన్‌కు నేరుగా విమాన సర్వీసులు లేనందున ఇతర దేశాలకు వెళ్లి.. అక్కడ నుంచి పాక్‌కు వెళ్లిపోయి ఉండవచ్చని సరిహద్దులో ఉన్న ప్రొటోకాల్ అధికారులు వెల్లడించారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.
మెడికల్ వీసాలు ఉన్నవారికి రేపటి వరకు గడువు
సార్క్ వీసాదారులకు ఏప్రిల్ 26నే గడువు ముగిసింది. మెడికల్ వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు ఉంది. ఇక వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, స్టూడెంట్, విజిటర్ తదితర 12 విభాగాల వీసాదారులకు నేటితో (ఏప్రిల్ 27) గడువు ముగిసింది. దీంతో పాక్ జాతీయులు స్వదేశానికి తిరుగుముఖం పట్టడంతో అట్టారీ సరిహద్దులో హడావిడి నెలకొంది. తమ బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు అనేక మంది భారతీయులు కూడా అక్కడకు చేరుకున్నారు.
Read Also: http://యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం