హైదరాబాద్ యాకత్‌పురలో ఓ చిన్నారి మ్యాన్‌హోల్(Manhole)లో పడిన ఘటన కలకలం రేపింది. స్కూల్ నుంచి వస్తున్న సమయంలో ఆటోను గమనిస్తూ వెళ్తుండగా పాప అనుకోకుండా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. అదృష్టవశాత్తు, వెంట వచ్చిన మహిళా సకాలంలో గమనించి, చుట్టుపక్కల వారి సహాయంతో చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ సంఘటన సమీప సీసీటీవీల్లో రికార్డ్ అవ్వగా, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జీహెచ్‌ఎంసీ నిరాకరణ, హైడ్రా బాధ్యత
ఈ ఘటనతో ప్రజల ఆగ్రహం జీహెచ్‌ఎంసీ(GHMC)పై వెల్లువెత్తింది. వర్షాకాలంలో మ్యాన్‌హోల్‌లను ఇలా నిర్లక్ష్యంగా తెరిచి ఉంచడమేంటని నెటిజన్లు మండిపడ్డారు. అయితే, జీహెచ్‌ఎంసీ మాత్రం ఈ ఘటనకు తమకు సంబంధం లేదని స్పష్టంచేసింది. మ్యాన్‌హోల్ నిర్వహణ బాధ్యతలు హైడ్రాకు అప్పగించబడినట్లు వెల్లడించింది. దీంతో విమర్శల దృష్టి హైడ్రాపై కేంద్రీకృతమైంది.
హైడ్రా అంగీకారం, చర్యలకు హామీ
తీవ్ర విమర్శల నడుమ హైడ్రా చివరికి స్పందించింది. కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, ఈ ఘటనకు హైడ్రానే పూర్తిగా బాధ్యత వహిస్తుందని అంగీకరించారు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇంఛార్జ్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యం మరల జరగదని హామీ ఇచ్చారు.