కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా (Amit Shah) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) ప్రకటించిన అత్యవసర పరిస్థితి (National Emergency) జాతీయ అవసరం కాదని.. కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యతిరేక మనస్తత్వానికి అది ప్రతీక అని అమిత్ షా ఆరోపించారు. కేవలం తన పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1975, జూన్ 25న అత్యవసర పరిస్థితిని విధించారన్నారు. ఆ సమయంలో దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించివేశారని, న్యాయవ్యవస్థ చేతులు కట్టేశారని, సామాజిక కార్యకర్తలను జైళ్లలో బంధించారని షా పేర్కొన్నారు. దీంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారని తెలిపారు. ప్రభుత్వం నియంతలా మారినప్పుడు, దానిని పడగొట్టే శక్తి ప్రజలకు ఉంటుందని ఈ రోజు అందరికీ గుర్తు చేస్తోందని షా అన్నారు.
ఎమర్జెన్సీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
అత్యవసర పరిస్థితి సమయంలో దేశంలోని ప్రజలు ఎన్నో హింసలు, బాధలు ఎదుర్కొన్నారని అమిత్ షా అన్నారు. అప్పుడు వారు ఎదుర్కొన్న సమస్యలను నేటితరానికి తెలియజేయడానికి భాజపా ప్రభుత్వం జూన్ 25ను ‘సంవిధాన్ హత్య దివస్’గా పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రతి భారతీయుడిలో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణ వంటి విషయాలపై అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని అన్నారు. తద్వారా కాంగ్రెస్ వంటి నియంతృత్వ శక్తులు మళ్లీ అటువంటి భయానక సంఘటనలను పునరావృతం చేయకుండా ఉంటాయని వ్యాఖ్యానించారు.
“పత్రికా స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ అణచివేతకు గురయ్యాయి”
సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. అంతర్గత కారణాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లినట్లు పేర్కొంటూ నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీఅహ్మద్ (Fakhruddin ali ahmed) రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 కింద ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ కాలంలో దేశ పౌరులు, పత్రికల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ తీవ్ర అణచివేతకు గురయ్యాయి. సుమారు 1.5 లక్షల మంది జైలు పాలయ్యారు.
ప్రజాస్వామ్య యాత్ర ప్రారంభం – దిల్లీ నుండి దేశవ్యాప్తంగా
1977, మార్చి 21 వరకు ఇది కొనసాగింది. దీంతో నాటి పరిస్థితులను వ్యతిరేకిస్తూ.. కేంద్ర ప్రభుత్వం బుధవారం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) ఆధ్వర్యంలో దిల్లీ(Dilhi)లో నేడు ‘ప్రజాస్వామ్య యాత్ర’ను ప్రారంభించనున్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులు,
ఎమర్జెన్సీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలపై అవగాహన పెంచేందుకు ఈ యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ వెల్లడించింది. ప్రభుత్వం నియంతగా మారినపుడు, దాన్ని తిరస్కరించే శక్తి ప్రజల చేతిలోనే ఉంటుంది. ఎమర్జెన్సీ నాటి పోరాటం దీన్ని స్పష్టం చేసింది.