వరుస సెలవులకు తోడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుతో ఈ నెల చివరలో బ్యాంకింగ్ సేవలకు భారీ అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తోంది. వారానికి 5 రోజుల పని దినాలను (5-Day Work Week) తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాలు జనవరి 27న సమ్మెకు పిలుపునిచ్చాయి. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ముందు ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, తుది నిర్ణయం వెలువడకపోవడంతో నిరసన తెలపాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ సమ్మెలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన లక్షలాది మంది సిబ్బంది పాల్గొనే అవకాశం ఉండటంతో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది.
BRS re entry : బీఆర్ఎస్‌లోకి రీఎంట్రీ? మహిపాల్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్!
జనవరి నాలుగో వారంలో క్యాలెండర్ సెలవులకు సమ్మె తోడవ్వడంతో బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. జనవరి 24వ తేదీ నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. ఆ మరుసటి రోజు జనవరి 25 ఆదివారం, ఆ తర్వాత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు ఉంది. ఈ మూడు రోజుల వరుస సెలవుల అనంతరం బ్యాంకులు తెరుచుకోవాల్సిన జనవరి 27న సమ్మె జరగనుంది. దీనివల్ల శనివారం నుండి మంగళవారం వరకు వరుసగా 4 రోజుల పాటు భౌతిక బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండవు.
బ్యాంకులు సుదీర్ఘకాలం మూతపడుతుండటంతో వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలు తమ ఆర్థిక లావాదేవీలను ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా భారీ మొత్తంలో నగదు డ్రా చేయాలన్నా లేదా డిపాజిట్ చేయాలన్నా శుక్రవారమే (జనవరి 23) పూర్తి చేసుకోవడం మంచిది. బ్యాంకులు మూతపడినా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, మరియు UPI సేవలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున అవసరమైన మనీని ముందే సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com