కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలను జన్వాడ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించి పోలీసులు విచారించారు. మోకిల పోలీసులు ఆయనను ప్రశ్నించిన తర్వాత రాజ్ పాకాలు మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల విచారణకు సహకరించానని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. తన ఫ్యామిలీ ఫాంహౌస్‌లో జరిగినది కేవలం ఒక కుటుంబ పార్టీయే అని వివరణ ఇచ్చారు. పోలీసుల చర్యల వల్ల తన కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైందని తెలిపారు.
. “మా ఇంట్లో మేము ఫ్యామిలీ పార్టీ చేసుకోకూడదా?” అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనకు ఎలాంటి డ్రగ్స్ లేదా అనుచిత కార్యకలాపాలు సంబంధం లేవని స్పష్టంగా చెప్పారు. తన కుటుంబం ఈ విచారణ వల్ల తీవ్ర ఆందోళనకు గురైందని, వారి వ్యక్తిగత జీవితంలో కలుగజేసుకోవడం తగదని అభిప్రాయపడ్డారు.
ఇంకా, ఈ కేసులో విజయ్ మద్దూరి తనకు వ్యతిరేకంగా ఎటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని రాజ్ పాకాలు స్పష్టం చేశారు. ఫాంహౌస్‌లో ఉన్నవారిలో ఎవరో ఒకరికి డ్రగ్ పాజిటివ్ రిపోర్టు వచ్చినా, దానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని కావాలనే పెద్దదిగా చూపిస్తున్నారని ఆరోపించారు.
విజయ్ మద్దూరి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన లాయర్ల ద్వారా ఈ విషయాన్ని పోలీసులకు తెలపడం జరిగింది. రాజ్ పాకాల విచారణ పూర్తయిందని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు.