అహ్మదాబాద్ (Ahmedabad) ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విమాన ప్రయాణాల భద్రతపై దేశవ్యాప్తంగా టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పక్షులు (Birds during landing) లేదా జంతువుల తాకిడులు తరచూ జరగడం ప్రమాదకరమైపోతోంది.హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2025 మొదటి ఐదు నెలల్లోనే 49 ఘటనలు నమోదయ్యాయి. ఇందులో పక్షులు, జంతువులు విమానాలకు ఢీకొట్టిన ఘటనలే ఎక్కువ. పైగా, 11 మేడే కాల్స్ కూడా వచ్చినట్టు సమాచారం. గత ఏడేళ్లతో పోలిస్తే ఇది తీవ్ర హెచ్చరికగా మారింది.డీజీసీఏ వెల్లడించిన డేటా ప్రకారం, దేశంలోని టాప్ 20 విమానాశ్రయాల్లో 2022లో 1,633 తాకిడులు నమోదయ్యాయి. 2023లో ఇవి 2,269కు పెరిగాయి. 2024లో కొద్దిగా తగ్గి 2,066గా ఉన్నాయి. ఇక 2025లో మే వరకు 641 ఘటనలు నమోదయ్యాయి. అంటే, ఈ సమస్య గణనీయంగా పెరిగిందే.

ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి పెద్ద నగరాల్లో పరిస్థితి మరింత కఠినం
ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో 2022లో 442, 2023లో 616, 2024లో 419 పక్షి తాకిడి ఘటనలు నమోదయ్యాయి. మే 2025 నాటికి 95 ఘటనలు జరగడం చూస్తే పరిస్థితి ఇంకా బాగా ఉందని అర్థమవుతుంది. అహ్మదాబాద్‌లో 2022లో 80గా ఉన్నవి, 2023లో 214కు పెరిగాయి.విమానాశ్రయాల చుట్టూ పట్టణీకరణ వేగంగా జరగడం, చెత్త నిల్వలు, జంతువులకు ఆహార వనరుల లభ్యత – ఇవన్నీ ప్రమాదాలకు దారి తీస్తున్నాయని నిపుణుల అభిప్రాయం. పక్షులు ఆశ్రయించే చోట్లను తగ్గించకపోతే సమస్య మరింత పెరిగే అవకాశముంది.
భద్రత కోసం ఏం చేస్తున్నారు?
విమానాశ్రయాల్లో అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. రెగ్యులర్ పెట్రోలింగ్, పక్షులను భయపెట్టే పరికరాలు, స్పెషల్ వన్యప్రాణి మేనేజ్‌మెంట్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇది చాలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.హైదరాబాద్ వంటి నగరాల్లో చెత్త నిర్వహణ, బహిరంగ వధ నిరోధం, వన్యప్రాణులను ఆకర్షించే పర్యావరణ కారణాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీని కోసం మున్సిపల్, పంచాయతీ అధికారుల సహకారం కీలకమని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.
Read Also : Rishabh Pant : 61 ఏళ్ల రికార్డుపై కన్నేసిన రిషబ్ పంత్