Bill Gates: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈరోజు భారత పార్లమెంట్‌ను ఆయన సందర్శించారు. పార్లమెంట్ మొత్తం కలియతిరిగారు. అక్కడ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తో చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గ్రామీణాభివృద్ధి సహా వివిధ సమస్యల పై చర్చ
కాగా, బిల్‌గేట్స్ తన పర్యటనలో భాగంగా ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి సహా వివిధ సమస్యలపై చర్చించారు. భారతదేశంలో జరుగుతున్న వ్యవసాయ పరిశోధనలు అద్భుతమైనవి అని బిల్ గేట్స్ చెప్పారు. ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. గడిచిన మూడేళ్లలో బిల్ గేట్స్ భారత్‌ను మూడు మార్లు సందర్శించడం విశేషం.
బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగింది
మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేడు ఢిల్లీ పార్లమెంట్ కు వచ్చిన బిల్‌గేట్స్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. బిల్ గేట్స్‌ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు కోరారు. అందుకు బిల్‌గేట్స్ అంగీకరించారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఏ విధంగా భాగస్వామ్యం కావొచ్చనే అంశంపై ఫలప్రదమైన చర్చ జరిగిందని తెలిపారు.