తెలంగాణలో భూ భారతి చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న భూదరఖాస్తులను సమీక్షించాలని, వాటిని వెంటనే అప్రూవ్ లేదా రిజెక్ట్ చేయాలని పేర్కొంది. ఇందులో ఆలస్యం జరిగితే భూవివాదాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, త్వరితగతిన స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

భూ భారతి చట్టం నిబంధనలు
ఈ నెల 14వ తేది తర్వాత వచ్చిన కొత్త దరఖాస్తుల విషయంలో, భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దరఖాస్తు తిరస్కరించినట్లయితే, ఎందుకు తిరస్కరించామో స్పష్టమైన కారణాలు రికార్డు చేయాలని స్పష్టం చేసింది. ఇందువల్ల దరఖాస్తుదారులు తమకు న్యాయం జరిగిందా లేదా అన్న విషయంలో స్పష్టత పొందగలుగుతారు.
భూసంబంధిత పత్రాలు, హక్కులపై స్పష్టత
అలాగే, దరఖాస్తుదారులు సమర్పించిన ఆధారాలను పరిగణలోకి తీసుకొని, సమస్యల పరిష్కారానికి అవకాశం కల్పించాలన్నదే ప్రభుత్వ దృక్పథమని తెలిపింది. భూసంబంధిత పత్రాలు, హక్కులపై స్పష్టత కోసం అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఈ చర్యల వల్ల భూ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, ప్రజలకు న్యాయం జరిగే అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.