అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తప్పవంటూ వార్నింగ్
అమరావతి : గ్రూప్-2మెయిన్స్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అని తెలిపారు. సోషల్ మీడియాలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఇలాంటి ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దు అని సూచించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

రెండు సెషన్లలో పరీక్షలు
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రద్దు అంటూ వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దు అని రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుందని ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈనెల 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుందని తెలిపారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మద్యాహ్నాం 3.గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది అని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది.
గ్రూప్-2మెయిన్స్‌పై అభ్యర్థుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షల్లో రోస్టర్ విధానంలో నెలకొన్న లోపాలను సరిచేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు.