ఫిలడెల్ఫియా: అమెరికాలో మరో విమాన ప్రమాదం సంభవించింది. ఇటీవల భారీ విమాన ప్రమాదం జరిగిన ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో ఓ విమానం అకస్మాత్తుగా క్రాష్ అయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందినట్లు తెలుస్తుంది. అంతేకాక..పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో లీర్‌జెట్ 55 విమానం ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి మిస్సోరిలోని స్ప్రింగ్‌ఫీల్డ్-బ్రాసన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది.

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ చిన్న విమానం ఈశాన్య ఫిలడెల్ఫియాలో శుక్రవారం సాయంత్రం కుప్పకూలింది. భారీ పేలుడు సంభవించి అక్కడ పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం క్రాష్ అయిన చోట కొన్ని ఇళ్లు, వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. భారీ పేలుడుతో షాపింగ్ కాంప్లెక్స్, జనావాసాల మధ్య విమాన ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, ఎమర్జెన్సీ సెక్యూరిటీ, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు.
వ్యాపార జెట్‌లు, చార్టర్డ్ విమానాలకు సేవలందించే ఈశాన్య ఫిలడెల్ఫియా ఎయిర్ పోర్టు నుంచి కేవలం 4 కిలోమీటర్ల లోపే ఈ ప్రమాదం జరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ చేసింది. క్రాష్ అయిన చోట సమీపంలోని ఇండ్లకు మంటలు అంటుకున్నాయి. విమాన ప్రమాదంతో అక్కడ షాపింగ్ మాల్స్ తాత్కాలికంగా క్లోజ్ చేశారని ఫిలడెల్ఫియాలోని అత్యవసర సేవల నిర్వహణ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6:06 గంటలకు ఎయిర్ పోర్ట్ నుంచి చిన్న జెట్ టేకాఫ్ అయింది. 1,600 అడుగుల ఎత్తుకు చేరుకోగా, కేవలం 30 సెకన్ల తర్వాత రాడార్ నుండి దాని సమాచారం లేదని విమాన డేటా చూపించింది.
కాగా, వాషింగ్టన్ సమీపంలో జనవరి 31న ఆర్మీ హెలికాఫ్టర్, ఓ విమానం ఢీకొన్న ప్రమాదంలో 64 మంది మృతిచెందారని తెలిసిందే. ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరిగ్గా సమాచారం చేరవేసి, కమ్యూనికేట్ చేసి ఉంటే ప్రమాదం తప్పి ఉండేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.