ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి వరుస ఎదురుదెబ్బలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పైచేయి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బలుగా మారుతున్నాయి. ఒకవైపు పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వైఎస్సార్‌సీపీని వీడుతున్న వేళ, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఇవాళ జరిగిన స్థానిక సంస్థల పదవుల కోసం జరిగిన ఎన్నికల్లో టీడీపీ మరికొన్ని ముఖ్యమైన పదవులను కైవసం చేసుకుంది. ముఖ్యంగా కదిరి మున్సిపాలిటీ, బొబ్బిలి మున్సిపాలిటీల్లో టీడీపీకి ఘన విజయాలు లభించాయి. ఇదంతా వైఎస్సార్‌సీపీకి ఒక పెద్ద రాజకీయ సందేశంగా భావించవచ్చు.
కదిరిలో టీడీపీకి భారీ విజయం – వైఎస్సార్‌సీపీకి మరో దెబ్బ
శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి చేరింది. మున్సిపల్ చైర్ పర్సన్‌గా దిల్షా దున్నీషా..వైస్ చైర్మన్లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచారి సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గెలుపుతో మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.. అయితే ఈ ఎన్నికను వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 ఉంటే 25 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అంతకముందు బెంగళూరు క్యాంప్‌లో ఉన్న టీడీపీ కౌన్సిలర్లు.. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక అనంతరం వైస్ చైర్మన్ల ఎంపిక ఏకగ్రీవమైంది.
ఇక విజయనగరం (Vijayanagar) జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో టీడీపీ మరో విజయాన్ని నమోదు చేసింది. శరత్‌బాబు మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. గత నెల 29న అప్పటి ఛైర్మన్ మురళీకృష్ణారావుపై అవిశ్వాస తీర్మానం వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఓటింగ్ జరిగింది. టీడీపీకి 20 మంది సభ్యుల మద్దతు లభించడంతో మురళీకృష్ణారావు తన పదవిని కోల్పోయారు. బొబ్బిలి మున్సిపాలిటీ అధికార కూర్చీ టీడీపీ ఖాతాలోకి చేరింది.
తిరువూరులో ఎన్నిక వాయిదా – కేవలం 7 మంది సభ్యులే హాజరు
తిరువూరు (Tiruvuru) నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపడింది.. కోరం లేకపోవడంతో మంగళవారానికి ఎన్నిక వాయిదా వేశారు. మొత్తం 20 మందికి గాను ఏడుగురు మాత్రమే హాజరుకావడంతో వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. శ్రీసత్యసాయిజిల్లా (Sri Sathya Sai District) రామగిరి ఎంపీపీ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి గైర్హాజరుకావడంతో ఎన్నిక వాయిదా పడింది. గతంలో కోరం లేక ఎంపీపీ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది.
ఇక విశాఖపట్నం జివీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదా పడింది. ఎన్నికకు అవసరమైన 56 మంది కార్పొరేటర్లలో 54 మంది మాత్రమే హాజరయ్యారు. కోరం నిండకపోవడంతో ఎన్నిక మంగళవారానికి వాయిదా వేసారు. ఈ పదవిని జనసేన పార్టీకి కేటాయించినప్పటికీ, ఎన్నిక నిర్వహణలో అంతరాయం తలెత్తింది. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఊహించని విజయం లభించగా, వైఎస్సార్‌సీపీకి తగులుతున్న రాజకీయ దెబ్బలు మరింతగా గమనించదగ్గవిగా మారుతున్నాయి.
Read also: Tiruvur: తిరువూరు చైర్మన్ ఎన్నికలు వాయిదా.. కారణం ఏమిటి?